సీమలో హైకోర్టుకి నేను వ్యతిరేకం కాదు: పవన్ కల్యాణ్

by srinivas |

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకి నేను వ్యతిరేకం కాదని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కర్నూలులో సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ చేసిన ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని కోరుతున్నానని, హైకోర్టు కర్నూలులో పెట్టేందుకు తాను అడ్డంకి కాదని ఆయన చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నానంటే న్యాయమైన అంశాలపై పోరాటం చేయనని కాదని ఆయన చెప్పారు.

ఎన్నార్సీపై తాను చెప్పేది ఒక్కటేనని.. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. పాకిస్థాన్ కూడా మైనారిటీలను కాపాడుతామని సంతకం చేసిందని, అది దాని మాట నిలబెట్టుకోలేదని పవన్ చెప్పారు. భారతీయుల రక్తంలోనే సెక్యులరిజం ఉందని అన్నారు. అబ్దుల్ కలామ్ ముస్లిం అని, ఆయనను రాష్ట్రపతిని చేశామని ఆయన చెప్పారు. అలాగే మహ్మద్ అజహరుద్దీన్ కూడా ముస్లిమేనని, ఆయన సారథ్యంలో క్రికెట్ ఆడామని ఆయన చెప్పారు. ముస్లింలను భారత్ చాలా గౌరవిస్తుందని, అంతగొప్ప దేశమని ఆయన తెలిపారు.

సుగాలి ప్రీతి తల్లి తనను మూడు నెలల క్రితం వచ్చి కలిశారని, అప్పుడే ఆమెతో కలిసి పోరాడుతానని మాటిచ్చానని ఆయన చెప్పారు. అందులో భాగంగానే ఈ ర్యాలీ నిర్వహించామని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతిచ్చిన బీజేపీకి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed