పగుళ్లు పట్టిన వంతెన.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం

by Shyam |
Manair Bridge
X

దిశ, మల్హర్: జయశంకర్ భూపాలపల్లి-పెద్దపల్లి జిల్లాల సరిహద్దులోని మల్హర్ మండలం కొయ్యూర్ పరిసరాల ప్రాంతంలోని పీవీ నగర్ మానేరు నదిపై ఉన్న వంతెనకు ముప్పు పొంచి ఉంది. దీంతో ప్రయాణికుల ప్రయాణం ప్రమాదం అంచున కొనసాగుతోంది. భారీ వాహనాల రాకపోకల రద్దీ పెరిగి వంతెన స్లాబు పగిలి ఇనుప చువ్వలు, పట్టీలు తేలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేరు నదిపై 1971లో నిర్మించిన బ్రిడ్జిని నాటి ముఖ్యమంత్రి పీవీ నరసింహా రావు ప్రారంభించారు. దాదాపుగా 47 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జికి ఇప్పటివరకూ ఎలాంటి మరమ్మతులు చేయలేదు. నాటి వాహనాల సామర్థ్యానికి అనుగుణంగా అధికారులు ఈ వంతెన నిర్మించారు.

అయితే, ప్రస్తుతం భారీ నుంచి అతిభారీ వాహనాలు రోజూ ఈ వంతెనపై ప్రయాణం చేస్తుండటంతో పగుళ్లు తేలి ప్రమాదంగా మారింది. జయశంకర్ జిల్లా భూపాలపల్లి-పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నుండి నిత్యం బొగ్గు రవాణా, అదేవిధంగా మహాదేవపూర్, దామరకుంట నుండి ఇసుక రవాణా ఈ మానేరు వంతెన పైనుంచే నిత్యం వందలాది లారీలు, భారీ వాహనాల రవాణా కొనసాగుతాయి. దీంతో మానేరు వంతెన భారీ పగుళ్లు తేలి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్తున్నామని వాపోతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే వంతెనకు మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed