విమానంలో వ్యక్తి మృతి.. థర్మల్ స్క్రీనింగ్‌లపై అనుమానాలు

by Shamantha N |
విమానంలో వ్యక్తి మృతి.. థర్మల్ స్క్రీనింగ్‌లపై అనుమానాలు
X

న్యూఢిల్లీ: గాల్లో ఎగురుతున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర జ్వరంతో మృతిచెందిన ఘటన తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నది. విమానాలు ఎక్కేముందు ప్రయాణికులపై జరిపే టెస్టులు, థర్మల్ స్క్రీనింగ్‌లకు సంబంధించి పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

కరోనా మహమ్మారితో వణుకుతున్న ఈ కాలంలో తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి విమానంలోకి ఎలా ఎక్కగలిగాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లాగోస్‌ నుంచి శనివారం ముంబయికి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలోకి ఎక్కిన 42 ఏళ్ల ప్రయాణికుడు తీవ్ర జ్వరంతో వణుకుతుండటాన్ని చూశామని తోటి ప్రయాణికులు తెలిపారు. సిబ్బంది వాకబు చేయగా, మలేరియాతో బాధపడుతున్నట్టు సదరు ప్రయాణికుడు తెలిపినట్టు సమాచారం.

శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న అతనికి ఆక్సిజన్‌ అందించారు. విమానంలో ఉన్న వైద్యుడు అతన్ని కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయిందనీ, మార్గ మధ్యలోనే మృతిచెందాడని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఈ విమానం ఆదివారం ఉదయం 3.40 గంటలకు ముంబయి ఎయిర్‌పోర్టు చేరింది. సహజ కారణాల వల్లే అతను మరణించాడని ఎయిర్ ఇండియా తెలిపింది. కాగా, తీవ్ర జ్వరమున్న ఆ ప్రయాణికుడు విమానం ఎలా ఎక్కగలిగాడా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed