ఈనెల 14నుంచి పార్లమెంటు సమావేశాలు..

by Anukaran |   ( Updated:2020-08-31 21:01:29.0  )
ఈనెల 14నుంచి పార్లమెంటు సమావేశాలు..
X

దిశ, న్యూస్‌బ్యూరో :

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి సమన్లు జారీ చేశారు. సెలవులు లేకుండా నిరంతరాయంగా 18 రోజులు కొనసాగేలా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సిఫారసు చేసింది. అయితే, ఉభయసభల బిజినెస్ అడ్వయిజరీ కమిటీ, వివిధ పార్టీల నేతలతో చర్చల అనంతరం నిర్దిష్టంగా సమావేశాల షెడ్యూలు ఖరారుకానుంది. సెప్టెంబరు 14 ఉదయం 9.00 గంటలకు లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సెక్రటరీ జనరల్ స్నేహలత ఉత్తర్వులు జారీచేశారు. రాజ్యసభ సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభం కానున్నా సమయం మాత్రం వేరుగా ఉండబోతోంది.

కరోనా నిబంధనల ప్రకారం సమావేశాలు నిర్వహించనున్నట్లు లోక్‌సభ సచివాలయవర్గాలు తెలిపాయి. లోక్‌సభ హాల్‌తో పాటు రాజ్యసభ హాల్‌ను కూడా లోక్‌సభ అవసరాల కోసమే వాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక రాజ్యసభ సమావేశం మాత్రం సెంట్రల్ హాల్‌లో జరగవచ్చని సమాచారం. కానీ, అందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు. పార్లమెంటు సభ్యుల వ్యక్తిగత సిబ్బందికి మాత్రం ఈసారి ప్రవేశం ఉండదు. మీడియా సిబ్బందికి సైతం అనేక ఆంక్షలు కొనసాగనున్నాయి. సందర్శకులకు ప్రవేశం పూర్తిగా నిషిద్దం. వారికి కేటాయించిన సీట్లలోనే ఎంపీలు కూర్చునే అవకాశం ఉంది. కరోనా నిబంధనల కారణంగా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సి ఉన్నందున సభ్యుల మధ్య తగినంత ఖాళీ ఉంచాల్సి వస్తోంది. దీని కోసం సందర్శకుల గ్యాలరీని సైతం వినియోగించనున్నారు.

శని, ఆదివారాలు, సెలవు దినాలతో సంబంధం లేకుండా 18 రోజుల పాటు అక్టోబర్ 1వ తేదీ వరకు కొనసాగించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎంపీలందరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు.పార్లమెంటు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కొత్తకొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇప్పటివరకూ ఎంపీలను అటు రాజ్యసభలో, ఇటు లోక్‌సభలో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేయలేదు. కానీ ఇప్పుడు వారి టెంపరేచర్, శారీరక అనారోగ్య లక్షణాల విషయంలో పరీక్షించక తప్పని పరిస్థితులు తలెత్తాయి.

Advertisement

Next Story

Most Viewed