- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పారా ఒలింపిక్స్: విధిని ఎదురించి పతకమే లక్ష్యంగా.. ఇండియన్ ప్లేయర్స్
దిశ, ఫీచర్స్ : విశ్వక్రీడల సంరంభం ముగిసింది. భారత్ గత రికార్డులు తిరగరాస్తూ ఈసారి అత్యధిక పతకాలు సొంతం చేసుకుని మువ్వన్నెలు రెపరెపలాడించింది. అలాగే ఆగస్టు 25నుంచి ప్రారంభం కాబోతున్న పారా ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటేందుకు భారత క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ ఏ గేమ్ అయినా సరే ప్రతీ అథ్లెట్‌లో అద్భుతమైన పోరాటంతో పాటు పతకాన్ని సాధించాలనే దృఢ సంకల్పం ఉంటుంది. అదే పట్టుదలతో జీవితంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుల స్ఫూర్తిదాయకమైన కథలు మీకోసం..
రియో డి జనీరో పారా ఒలింపిక్స్‌లో రెండు బంగారు పతకాలతో పాటు, ఒక రజతం, ఓ కాంస్యంతో పారా అథ్లెట్స్ యావత్ భారతీయ క్రీడాభిమానులకు ఆనందాన్ని పంచారు. లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 10మంది మాత్రమే పాల్గొనగా, 2016లో ఆ సంఖ్య 19కు చేరుకుంది. ఈసారి మరిన్ని పతకాలు ఒడిసిపట్టేందుకు ఆ సంఖ్య రెట్టింపు కాగా ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కానోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, పవర్‌లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో వంటి తొమ్మిది పారా క్రీడల్లో 54 మంది అథ్లెట్లతో భారత్ అతిపెద్ద బృందాన్ని రంగంలోకి దింపుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల సాధించిన విజయాలను బట్టి పారా ఒలింపియన్‌లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారని క్రీడాభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు.
పాలక్ కోహ్లీ – బ్యాడ్మింటన్
బ్యాడ్మింటన్ ఎల్లప్పుడూ భారతీయులకు ప్రత్యేకమైంది. సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి ప్లేయర్స్ ఒలింపిక్స్ పతకాలతో బ్యాడ్మింటన్ క్రీడకు అపారఖ్యాతిని తీసుకురాగా, టోక్యో పారా ఒలింపిక్స్‌లో తొలిసారి బ్యాడ్మింటన్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళల్లో పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ పాలక్ కోహ్లీ రాబోయే టోక్యో టోక్యో పారాలింపిక్స్‌లో సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌ల్లో పోటీపడనుంది. పుట్టుక నుంచే ఎడమ చేయి పూర్తిగా అభివృద్ధి చెందలేకపోయినా.. మూడు ఫార్మాట్లలో పాల్గొంటున్న క్రీడాకారిణిగా, పారా ఒలింపిక్స్‌లో యంగెస్ట్ పారా షట్లర్‌గా ఆమె గుర్తింపు పొందింది. అలాగే 2019లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్‌ల్లో పాల్గొన్న కోహ్లీ అనేక పతకాలు తన ఖాతాలో వేసుకుంది.
సకీనా ఖాతున్ – పవర్ లిఫ్టింగ్
కోల్‌కతా కోరాపరా గ్రామంలో పుట్టిన సకీనా.. చిన్న వయస్సులోనే పేదరికం, పోలియోతో పోరాడింది. తండ్రి రోజువారీ కూలీగా, తల్లి ఇళ్లలో పనిమనిషిగా, సోదరుడు టైలరింగ్ దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. అయితే చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ చూపే సకీనా, అథ్లెటిక్‌గా వివిధ క్రీడలు ఆడేది. దీంతో తన ప్రతిభను గుర్తించిన ఓ కోచ్ ఆమెను ప్రోత్సహించడంతో పవర్‌లిఫ్టింగ్ చేపట్టింది. 2014లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో పారా-స్పోర్ట్స్‌లో దేశానికి పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా సకీనా నిలవడం విశేషం. ఆమె 2018 పారా ఆసియన్ గేమ్స్ రజత పతక విజేత కూడా. 2010లో దిలీప్ మజుందార్, ఆమె ప్రస్తుత కోచ్ ఫార్మన్ బాషా ఆర్థిక సహాయంతో పవర్‌లిఫ్టింగ్ శిక్షణను కొనసాగిస్తోంది.
జ్యోతి బలియాన్ – విలువిద్య
ఉత్తర ప్రదేశ్ నివాసి 27 ఏళ్ల జ్యోతి.. టోక్యో పారా ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఏకైక భారతీయ మహిళా ఆర్చర్. రైతు కుటుంబంలో పుట్టిన జ్యోతికి చిన్న వయసులో కాలికి తప్పుడు ఇంజక్షన్ ఇవ్వడంతో అది పోలియోకు దారితీసింది. దీంతో తన ఎదుగుదలకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎప్పుడూ వెనకడుగువేయలేదు. తనకంటూ గుర్తింపు ఉండాలని నిత్యం శ్రమిస్తూ 2009లో విలువిద్యను చేపట్టింది. ప్రస్తుతం ఆమె దేశంలోనే అగ్రశ్రేణి పారా ఆర్చర్‌లలో ఒకరిగా ఎదిగింది. నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఉత్తమప్రతిభ కనబరిచి, ప్రపంచ ర్యాంకింగ్‌లో 17వ స్థానానికి ఎగబాకడంతో పాటు టోక్యో పారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
అవని లేఖరా – షూటింగ్
2012లో 10 ఏళ్ల వయస్సులోనే కారు ప్రమాదానికి గురవగా.. అవని వెన్నుముఖ తీవ్రంగా గాయపడింది. దీంతో వీల్‌చైర్‌కి పరిమితమై మూడేళ్ల తర్వాత తండ్రి ఆమెను ఓ ప్రొఫెషనల్ షూటర్‌గా తయారు చేసేందుకు ప్రోత్సహించాడు. అలాగే విలువిద్య, రైఫిల్ షూటింగ్ కూడా ప్రయత్నించింది. కానీ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ‘అభినవ్ బింద్రా ఆత్మకథ-ఎ షాట్ ఎట్ హిస్టరీ’ చదివిన తర్వాత ఆమె రైఫిల్ షూటింగ్ వృత్తిపరంగా కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఇక ఆనాటి నుంచి కష్టపడి పనిచేస్తూ, క్రమం తప్పకుండా సాధన చేస్తోంది. ఈ క్రమంలోనే అవని అనేక రాష్ట్రాలతో పాటు జాతీయ, ప్రపంచస్థాయి చాంపియన్‌షిప్‌ల్లో పాల్గొని పతకాలు సాధించింది. యూఏఈలో జరిగిన పారా షూటింగ్ వరల్డ్ కప్‌లో ఆమె సాధించిన రజత పతకమే.. టోక్యో పారాలింపిక్స్ ఎంపికకు అర్హత సాధించేందుకు ఉపయోగపడింది.
అరుణ తన్వర్ – తైక్వాండో
రెండు చేతుల్లోనూ వైకల్యంతో పుట్టిన అరుణను ఇతర పిల్లల్లాగే పెంచాడు తండ్రి. 2008లో మార్షల్ ఆర్ట్స్ క్లాస్‌లో చేరతానని పేరెంట్స్‌కు చెప్పగా.. వారు ఆమె నిర్ణయానికి మద్ధతిచ్చారు. ఈ క్రమంలోనే రాబోయే టోక్యో పారాలింపిక్స్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ పొందిన భారతదేశపు మొట్టమొదటి తైక్వాండో క్రీడాకారిణిగా నిలిచింది. గత కొన్నేళ్లుగా స్థిరమైన ప్రదర్శన చేస్తున్న అరుణ, టర్కీలో జరిగిన వరల్డ్ పారా తైక్వాండో చాంపియన్‌షిప్ 2019లో కాంస్య పతకం, జోర్డాన్‌లో జరిగిన ఏషియన్ పారా తైక్వాండో చాంపియన్‌షిప్-2019లో మరో కాంస్య పతకం గెలుచుకుంది.
రూబీనా ఫ్రాన్సిస్ (షూటింగ్), ప్రమోద్ భగత్(పారా బ్యా్డ్మింటన్), పారుల్ పర్మార్ (పారా బ్యా్డ్మింటన్), మనీష్ నర్వాల్ (షూటింగ్), కశిష్ లక్రా (క్లబ్ త్రో) వంటి ప్లేయర్స్ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక స్వర్ణపతక విజేతలు దేవేంద్ర జజారియా, మరియప్పన్ తంగవేలు ఇద్దరూ తమ రియో 2016 టైటిళ్లను కాపాడుకోవడానికి టోక్యోకు వెళ్లారు. జావెలిన్ త్రో మరోసారి భారతీయ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. సుమిత్ ఆంటిల్, సందీప్ చౌదరి అత్యుత్తమ ఆటతీరుతో పతకం ఖాయం చేసేలా కనిపిస్తున్నారు. ఇక ఆటల జాబితాలో బ్యాడ్మింటన్ జోడించడం భారతదేశ పతక ఆశలకు మరింత ఊతమిచ్చింది.