ఆయుధాలు మోస్తున్న పాక్ డ్రోన్‌ను కూల్చిన బలగాలు

by Shamantha N |   ( Updated:2020-06-20 02:52:20.0  )
ఆయుధాలు మోస్తున్న పాక్ డ్రోన్‌ను కూల్చిన బలగాలు
X

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు పాక్ నుంచి ఆయుధాలను సరఫరా చేస్తున్న ఓ డ్రోన్‌ను భారత బలగాలు శనివారం ఉదయం నేలకూల్చాయి. ఒక ఎం4 రైఫిల్, రెండు మ్యాగజైన్‌లు, పేలుడు పదార్థాలను ఈ డ్రోన్ నుంచి స్వాధీనం చేసుకున్నాయి. పాక్ సరిహద్దు దాటి భారత్ వైపున ఆకాశంలో చక్కర్లు కొడుతున్న ఈ డ్రోన్‌ను ఉదయం 5.10 గంటల ప్రాంతంలో ఓ బీఎస్ఎఫ్ జవాను గుర్తించారు. 250 మీటర్లమేర భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన ఆ డ్రోన్‌పై తొమ్మిది రౌండ్లు కాల్పులు జరపడంతో నేలకూలింది. పాకిస్తానీ ఏజెన్సీలు అలీ భాయ్ అనే ఉగ్రవాదికి ఈ డ్రోన్ ద్వారా ఆయుధాలను చేరవేసేందుకు యత్నించాయని ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. అతని పేరే ఆ డ్రోన్‌పై రాసి ఉన్నదని వివరించారు. కశ్మీర్‌ కథువా సెక్టార్‌కు సమీపంలోని పాకిస్తాన్ పికెట్ నుంచి ఈ డ్రోన్‌ను నియంత్రించి ఉండొచ్చని తెలిపారు. జమ్ము రీజియన్‌లో ఇటీవలే ఓ ఎన్‌కౌంటర్‌లో మరణించిన జైషే మహమ్మద్ ఉగ్రవాది నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలలాగే ఈ డ్రోన్‌లో లభించిన ఆయుధాలున్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. జైషే ఉగ్రవాదులను యాక్టివ్ చేసి కశ్మీర్‌లో అశాంతిని సృష్టించాలనే పాకిస్తాన్ భావిస్తున్నదని అన్నారు. కుప్వారా, రజౌరీ, జమ్ము సెక్టార్‌లలో బార్డర్ ద్వారా పలుసార్లు పాకిస్తాన్ ఆయుధాలను స్మగుల్ చేసేందుకు యత్నించగా, వాటిని తిప్పికొట్టామని వివరించారు.

Advertisement

Next Story