ధోనీ రిటైర్మెంట్: పాక్ అభిమాని సంచలన నిర్ణయం 

by Shyam |
ధోనీ రిటైర్మెంట్: పాక్ అభిమాని సంచలన నిర్ణయం 
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్‌ నుంచి తప్పుకుంటూ శనివారం రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధోని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీని ఎంతగానో ఆరాధించే వీరాభిమాని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను కూడా క్రికెట్ చూడటానికి రిటైర్మెంట్ చెప్పాడు. ఇందులో సంచలనం ఏముంది అనుకుంటున్నారా? ఉంది… ఎందుకంటే అతడు పాకిస్తాన్ కి చెందినవాడు కాబట్టి.

పాకిస్తాన్ కి చెందిన మహ్మద్ బషీర్.. ‘చాచా చికాగో’గా క్రికెట్ అభిమానులకు బాగా సుపరిచితుడు. ధోనీకి బషీర్ వీరాభిమాని. ఎంతలా అంటే.. ధోనీ ఆటను ప్రత్యక్షంగా చూడటానికి ప్రతీ మ్యాచ్‌కు ఇతర దేశాలకు వెళ్ళేటంత. ‘ధోనీ లవ్ యూ’ అని ధోనీ చిత్రాలతో కూడిన షర్టు ధరించి స్టేడియంలో తెగ సందడి చేసేవాడు. అప్పుడప్పుడు ధోనీనే స్వయంగా బషీర్‌కు ఫ్లైట్ టికెట్ బుక్ చేసేవాడు.

చికాగోలో రెస్టారెంట్ నడుపుతూ జీవితం సాగిస్తున్న బషీర్.. ధోనీని పలుమార్లు కలిశాడు. ధోనీతో కలిసి బషీర్ ఎన్నోసార్లు ఫొటోలు, సెల్ఫీలు కూడా దిగాడు. భారత్‌కు చెందిన ధోనీని అంతలా అభిమానిస్తున్న అతనిపై పాక్ అభిమానులు విమర్శలు చేస్తున్నా బషీర్ అవేవీ పట్టించుకోలేదు. ధోనీపై అంతే అభిమానం చూపించేవాడు. ధోనీ.. రిటైర్మెంట్‌పై స్పందిస్తూ.. పరిస్థితులు సాధారణ స్థితికొచ్చాక రాంచీలోని ఇంటికి వెళ్లి ధోనీని కలుస్తానన్నాడు.

రాంబాబును(మొహాలీకి చెందిన ధోనీ మరో వీరాభిమాని) కూడా తనతో రావాల్సిందిగా అడుగుతానని తెలిపాడు. ఐపీఎల్‌లో ధోనీ ఆటను చూసేందుకు వెళ్లాలని ఉందని.. కానీ కరోనా కారణంగా ప్రయాణాలపై నిబంధనలు, దానికి తోడు తన ఆరోగ్యం మెరుగ్గా లేకపోవడంతో వెళ్లలేకపోతున్నట్లు బషీర్ చెప్పాడు.

Advertisement

Next Story