ఓదార్పుకు రాలే.. ఓటుకస్తుండ్రు!

by Sridhar Babu |   ( Updated:2020-11-01 20:48:47.0  )
ఓదార్పుకు రాలే.. ఓటుకస్తుండ్రు!
X

దుబ్బాక, దిశ ప్రత్యేక ప్రతినిధి: మల్లన్నసాగర్ పుణ్యాన నిండా మునిగారు.. అన్నీ కోల్పోయారు.. నలుగురికి పనిచ్చే స్థాయి నుంచి పనికి యాచించే స్థాయికి దిగజారారు.. కళ్లముందే సర్వస్వం మునిగిపోతుంటే చెమ్మగిల్లిన కళ్లతో చూశారే తప్ప ఏమీ చేయలేకపోయారు.. ఆదుకుంటామన్న హామీలను నమ్మి అన్నీ సమర్పించుకుని నడిరోడ్డున నిలబడ్డారు.. మొక్కుబడిగా అందిన సాయాన్ని స్వీకరించి తృప్తిపడ్డారు.. ఇన్నాళ్లు పుట్టెడు దు:ఖంలో ఉన్న తమను ఎవరూ పట్టించుకోలేదు కానీ, దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు కలుస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఏ పార్టీకి మద్దతు పలకాలో, ఎవరిని నమ్మాలో తెలియడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని తొగుట, మిర్‌దొడ్డి మండలాల్లోని పద్నాలుగు గ్రామాల్లోని సుమారు పది వేల రైతు కుటుంబాల నిర్ణయమే పార్టీల భవితవ్యం నిర్ణయించే అవకాశం ఉంది. కాగా, ప్రధాన పార్టీలన్నీ రైతులు తమవైపే ఉన్నారనే ధీమాతో ప్రచారం సాగిస్తున్నారు.

ఉన్న భూమి, గూడు చెల్లాచెదురైంది..

మల్లన్నసాగర్ గట్టు పక్కనే ఉన్న రాంపూర్ గ్రామ వందలాది రైతులు రెండేళ్లుగా పనిచేసుకోడానికి సొంత పొలం లేక, మరో చోట పనిచేసే అవకాశం లేక రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. సగటున ఒక్కో రైతు నాలుగు ఎకరాల మేర ముంపు ప్రాంతం పేరుతో కోల్పోయారు. అప్పట్లో ప్రభుత్వం ఒక్కో ఎకరానికి ఆరు లక్షల రూపాయల రేటు కట్టి వీరి భూముల్ని స్వాధీనం చేసుకుంది. ముంపులో వీరి ఇండ్లు కూడా పోగొట్టుకోవడంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చింది. ఇప్పటివరకూ ఇళ్లు ఇవ్వకపోవడంతో వచ్చిన పరిహారంతో కొందరు మాత్రం ఇళ్లు కట్టుకున్నారు.

తిండి పెట్టినదాన్ని.. ఆధారపడాల్సి వస్తాంది..

‘‘మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద నాలుగెకరాల సాగుభూమి పోయింది. మేం పదకొండు మందిమి. పెద్ద కుటుంబం. పనికోసం ఇప్పుడు ఒక్కొక్కరం ఒక్కో చోటుకు వెళ్లినం. నిన్నటిదాకా సొంత భూమిలో పంటలు పండించుకున్నం. ఇప్పుడు ఇతర రైతుల నుంచి టమాటాలు, కూరగాయలు కొనుక్కుని రోడ్డు పక్కన బల్ల మీద అమ్ముకుంటున్నా. ఈ పని నామోషీ అనుకోవడం లేదు, కానీ వ్యాపారం జరగడం నా చేతుల్లో లేదు. ఇంతకాలం నా చేతుల మీదుగా తిండిపెట్టిన. ఇప్పుడు ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన రూ. 13 లక్షలతో ఒక్క ఎకరం కూడా కొనుక్కోలేపోయా. ఆ డబ్బులు చేతికొచ్చే సమయానికే భూముల ధరలు ఎక్కువగా పెరిగాయి. వచ్చిన డబ్బులతో అర ఎకరం కొనడమే గగనంగా మారింది. ఇంకేం పని చేసుకుని బతకాలి..?’’

-సుగుణమ్మ, తొగుట

రెండేళ్లుగా చెట్టు నీడనే..

మల్లన్నసాగర్‌లో నా భూమంతా పోయింది. ఎకరానికి ఆరు లక్షల రూపాయలు వచ్చినయ్. డబుల్ బెడ్రూం వస్తదనుకున్నాగానీ రాలేదు. ఈ మధ్యనే ఆ డబ్బులతో ఇల్లు కట్టుకున్నా. సేద్యం పనులు లేకపాయె. నాకు ఇంకేం పని చేతకాదు. ముసలోడ్ని గదా నాకు పని ఎవరిస్తరు.? సొంత భూమి ఉంటే ఏదో ఒక పని ఉండేది. పొలం గట్టుకాడికి పోయేటోడ్ని. కౌలు తీసుకుందామంటే అదీ లేదు. అందుకే పొద్దటి నుంచి ఈ రోడ్డు పక్క చెట్టే నాకు కాలక్షేపం. గవర్నమెంటు నుంచి వచ్చిన డబ్బులతో మళ్లీ పొలం కొనుక్కుందామనుకున్నా. కానీ రేటెక్కువ ఉండె. కొనలేకపోయిన. రేషను బియ్యం వస్తున్నయి. పింఛను కూడా వస్తాంది. నా సోపతి రైతులతో ఇట్ల మాట్లాడుకుంటం. సాయంత్రానికి ఇంటికి పోతం. ఇగ ఇదే నా పని.

-రామయ్య, రైతు, రాంపూర్ గ్రామం

పైరవీ జేసినోళ్లకు ఎక్కువ పైసలిచ్చిండ్రు..

రాత్రికి రాత్రి ఆఫీసర్లు వచ్చిండ్రు. ఇల్లు ఖాళీ చేయమన్నరు. భూమి గిట్ల పాయె. హడావిడిగా ఆరు లక్షల రేటు గట్టి పొలానికి డబ్బులిచ్చిండ్రు. ఇంటికి ఏమీ ఇయ్యలె. రెండు నెలల తర్వాత చేతికి డబ్బులొచ్చినయ్. అప్పటికే గ్రామాలల్ల భూముల రేట్లు పెరిగినయ్. డబ్బులు సరిపోక కొనలేకపోయినం. మా ఊర్లనే పార్టీ పలుకుబడి ఉన్నోళ్లకు తలా పన్నెండు లక్షల రూపాయల వచ్చినయ్. మాకంటే డబల్ రేటు ఇచ్చిండ్రు. ఆఫీసర్లను అడిగినా ఏం చెప్పలే. అన్యాయమైపోయినం. పార్టీ వాళ్లు దగ్గరుండి ఎక్కువ రేటు ఇప్పించిండ్రు. కండ్ల ముందే పొలాలన్నీ మాయమైపోయినయి. రోజూ రోడ్ల మీద టిప్పర్లు, లారీలు రయ్యరయ్య తిరుగుతనే ఉన్నయి. చూస్తుండగనే కాల్వ గట్టు కట్టిండ్రు. చూద్దామన్నా ఆ పొలాలు కనిపిస్తలేవు. చేయనీకి పనిలేదు. ఆ ముచ్చట.. ఈ ముచ్చట మాట్లాడుకుంటున్నం.

-ఎల్లయ్య, రైతు, రాంపూర్

ఓటు ఎవరికెయ్యద్దో బాగా అర్థమైంది..

ఇప్పటికి ఎన్నో ఎన్నికలను చూసినం. ముత్యం రెడ్డి మా ఊరికి చేసిన అభివృద్ధి చూసినం. ఆయన కట్టించిన చెక్ డ్యాములు మా కళ్ళ ముందే వచ్చినయ్. ఇప్పుడు పెద్దపెద్ద కార్లు తిరుగుతున్న రోడ్లన్నీ అప్పుడు ముత్యంరెడ్డి హయాంల వచ్చినవే. అప్పుడు అట్లున్న మా బతుకులు ఇప్పుడు ఆగమైపాయె. ప్రాజెక్టు వస్తదంటే చెక్‌డ్యాముల కంటే ఎక్కువ నీళ్లు వచ్చి మంచి పంటలు పండుతయ్ అనుకున్నం. కానీ ఉన్న పొలాలే పోతయనుకోలే. ఇగపైన బతుకెట్ల అన్నదే అర్థమయితలేదు. నాలాంటి రైతులకు దిక్కు లేకుంట బతుకు ఆగమాగమాయె. ఏ పార్టీకి ఓటు వేయాల్నో చెప్పంగానీ, ఏ పార్టీకి వేయొద్దో బాగా అర్థమైంది.

-లక్ష్మాపూర్ కు చెందిన ఓ రైతు మనోగతం

Advertisement

Next Story