టీఎస్‌పీఎస్సీలో ఒక్క చాన్స్ ప్లీజ్.. సీఎంకు పద్మశాలి సంఘాల విజ్ఞప్తి..!

by Shyam |   ( Updated:2021-04-18 10:27:39.0  )
టీఎస్‌పీఎస్సీలో ఒక్క చాన్స్ ప్లీజ్.. సీఎంకు పద్మశాలి సంఘాల విజ్ఞప్తి..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పబ్లిక్ సర్వీస్​కమిషన్‌లో ఈసారి పద్మశాలి సామాజిక వర్గం తరపున అవకాశం కల్పించాలని అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ పద్మశాలి సంఘం, తెలంగాణ పద్మశాలి ప్రొఫెషనల్స్​అండ్ అఫీషియల్స్​అసోసియేషన్స్​సంయుక్తంగా విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు వినతి పత్రాలు పంపించాయి. అనంతరం ఆయా సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో చాలా ప్రాముఖ్యత కల్గిన పబ్లిక్​సర్వీస్ కమిషన్‌లో ఈసారి డా. గండూరి వెంకటేశ్వర్లుకు అవకాశం కల్పించాలని కోరారు. టీఎస్​పీఎస్సీలో సుదీర్ఘకాలం పని చేసిన అనుభవం ఉందని, ప్రస్తుతం అసిస్టెంట్​సెక్రెటరీ హోదాలో పని చేస్తున్న ఆయనకు పలు అంశాలపై అనుభవం ఉందని, వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉండటంతో ఇలాంటి అనుభవం ఉన్న అధికారిని సభ్యుడిగా నియమిస్తే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని వారు విజ్ఞప్తి చేశారు. టీఎస్​పీఎస్సీలో 26 ఏండ్లు పని చేసిన వ్యక్తి కావడంతో నియామకం ప్రక్రియలో కీలకంగా ఉంటాడని వివరించారు. తెలంగాణ సాధన కోసం ముందుండి పని చేసిన ఉద్యోగ సంఘాలకు ప్రతినిధిగా ఉన్నాడని, టీఎన్జీఓ, టీజీఓలో కీలకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తెలంగాణ గెజిటెడ్​ అధికారుల సంఘం హైదరాబాద్​నగర శాఖ అధ్యక్షుడిగా పని చేస్తున్న డా.గండూరి వెంకటేశ్వర్లును టీఎస్​పీఎస్సీలోకి తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. పద్మశాలి సామాజిక వర్గానికి అటు ఏపీపీఎస్సీలోగానీ, ఇప్పుడు టీఎస్​పీఎస్సీలో కూడా ఇప్పటివరకు ప్రాతినిథ్యమే లభించలేదని, కేవలం సామాజిక వర్గాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా అపార అనుభవం, విద్యార్హతలను కూడా తర్వాతే అవకాశం కల్పించాలని వారు కోరారు. ఉద్యోగ సంఘాలు, బీసీ సంఘాలు డా. గండూరి వెంకటేశ్వర్లుకు మద్దతుగా ఉంటాయని, ప్రభుత్వం దీనిపై ఆలోచన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌కు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఎన్​. శ్రీధర్ సుంకుర్వార్, ప్రధాన కార్యదర్శులు గడ్డం జగన్నాథ్​, రమేష్​, నర్సింహులు, ఉపాధ్యక్షుడు కందగట్ల స్వామి, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాడం బాబురావు, ప్రధాన కార్యదర్శి సూర్య నారాయణ, కోశాధికారి విశ్వనాథం, పద్మాశాలి అఫీషియల్స్​ అండ్​ ప్రొఫెషనల్స్​ తరుపున సామల సహదేవ్ తదితరులు సీఎంకు వినతిపత్రం పంపించారు.

Advertisement

Next Story

Most Viewed