ఇకపై జగన్ వెనుక పద్మం కనబడదు

by srinivas |
ఇకపై జగన్ వెనుక పద్మం కనబడదు
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించే సమీక్షలు, సమావేశాల్లో ఆయన వెనుక బంగారు వర్ణంలో మెరిసే పద్మాన్ని గమనించారా? గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్ రైజ్ స్టేట్‌గా నామకరణం చేస్తూ, ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బంగారు వర్ణ పూర్ణ వికసిత పద్మం. సీఎం సీటుకు ఈ పద్మం ప్రత్యేక హంగుగా కనిపించేది. ఇకపై ఈ పద్మం కనిపించదు. ఎందుకంటే అధికారులు దానిని తొలగించారు. దాని స్ధానంలో ఏపీ ప్రభుత్వ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు.

పాలనతో పాటు వ్యవహార శైలిలో కూడా టీడీపీ తలంపు లేకుండా చేసేందుకు జగన్ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో బాబు కనిపిస్తే ఆయన వెనుక పద్మం కనిపించేది. జగన్ సీఎం అయిన తరువాత కూడా దానిని తొలగించలేదు. అయితే అకస్మాత్తుగా దానిని తొలగించడం వెనుక కారణాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే దాని తొలగింపుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర కార్యక్రమాలన్నీ రద్దు కావడంతో సీఎం మాత్రమే మీడియా సమావేశాల్లో కనిపిస్తున్నారు. దీంతో అన్ని దినపత్రికలతో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా ఆయన ఫోటోలే ప్రచురితమవుతున్నాయి. ఇందులో పూర్ణ వికసిత పద్మం టీడీపీని గుర్తు తెస్తోందన్నది ఒక వర్గం వాదన.

మరోవాదన ప్రకారం జగన్ ఏ కార్యక్రమం చేపట్టినా న్యాయస్ధానాల్లో చిక్కులు ఎదురవుతున్నాయి. వాటన్నింటికీ కారణం వాస్తు అని ఒక జ్యోతిష్యుడు చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన సలహా మేరకు సీఎం తన వెనుకనున్న పూర్ణ వికసిత పద్మాన్ని తొలగించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే అమరావతి ప్రాంతానికి ఉన్న చారిత్రక నేపథ్యంతో పాటు బౌద్ధుల చరిత్రను గుర్తు చేసే విధంగా ఉన్న పూర్ణ వికసిత పుష్పాన్ని తొలగించడం సరికాదన్నది విపక్షాల ఇంకో వాదన. మరో వాదనగా.. వాస్తవానికి సెక్రటేరియట్‌లో కూడా బంగారు వర్ణ పూర్ణ వికసిత పద్మం ఒకటి ఉంటుంది. అది కూడా పెద్దదే. దానిని తొలగించాలంటే ముందుగా క్యాంపు కార్యాలయంలోది తొలగించాలని, ఆ నేపథ్యంలోనే దీనిని తొలగించారని, త్వరలో దానిని కూడా తొలగించనున్నారని తెలుస్తోంది.

Tags: ys jagan, ysrcp, cm camp office, secriteriet, purnavikasita padmam, ap emblem

Advertisement

Next Story

Most Viewed