- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆశలు నిలిపిన ‘ఆక్స్‌ఫర్డ్’.. కొవిడ్ టీకాతో సత్ఫలితాలు
న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ప్రపంచవ్యాప్తంగా పెట్టుకున్న ఆశలను సజీవంగా నిలిపింది. ఈ టీకా హ్యూమన్ ట్రయల్స్ తొలిదశ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇమ్యూ్న్ రెస్పాన్స్‌ను పెంచుతున్నది. కేవలం యాంటీబాడీలనే కాదు, టీ సెల్స్‌నూ అభివృద్ధి చేస్తున్నది. తాము మంచి ఇమ్యూన్ రెస్పాన్స్ చూశామని, కేవలం వైరస్ హంతక యాంటీబాడీలే కాదు, టీ సెల్స్ లెవల్స్ పెరగడాన్నీ గమనించామని ఆక్స్‌ఫర్డ్ జెన్నర్ ఇనిస్టిట్యూట్ హెడ్ ఆడ్రియన్ హిల్ వెల్లడించారు. తాము వ్యాధి నిరోధక వ్యవస్థ రెండు చేతులనూ ప్రేరేపిస్తున్నామని వివరించారు. ఒక్క డోస్‌తోనే ట్రయల్స్‌లో పాల్గొన్న 1,077 మందిలో 90శాతం పార్టిసిపెంట్లలో మంచి రోగనిరోధక శక్తి చైతన్యం కనిపించింది. మరో డోస్ ఇవ్వగా మిగతా 10శాతం మందిలోనూ ఈ అభివృద్ధి కనిపించింది. 70శాతం మందిలో తలనొప్పి, జ్వరం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. అయితే, వీటిని పారాసిటమల్‌తో నయం చేసుకోవచ్చునని పరిశోధకులు తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన టీకా ChAdOx1 nCoV-19నే ప్రపంచంలోనే ప్రస్తుతం అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నది. మూడో దశ ట్రయల్స్ నిర్వహిస్తున్నది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఏడాది చివరికల్లా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అదికూడా ముందుగా హెల్త్ కేర్ వర్కర్లు, కరోనా తీవ్రంగా ఉన్న పేషెంట్లకు అందించే యోచన చేస్తున్నారు.
టీకా సేఫే..
ఈ ChAdOx1 nCoV-19 టీకాను ఆక్స్‌ఫర్డ్ అనూహ్య వేగంతో అభివృద్ధి చేస్తున్నది. చింపాంజీల్లో జలుబు కలుగజేసే వైరస్‌కు జెనెటికల్‌గా మార్పులు చేసి ఈ టీకాను అభివృద్ధి చేస్తున్నది. దాని ద్వారా కలిగే ప్రమాదాన్ని నివారించడంతోపాటు కరోనావైరస్‌లాగా మార్పు చేయడానికి ప్రయోగాలు జరిపారు. కరోనా వైరస్‌లా మార్చి ఈ టీకాను అభివృద్ధి చేశారు. తర్వాత ఈ టీకా సురక్షితమేనా? కాదా? అనేది నిర్ధారించుకోవడానికి 1,077 మందిపై ట్రయల్స్ నిర్వహించారు. ఈ టీకాతో ప్రమాదమేమీ లేదని తాజా ఫలితాలను ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో ప్రచురించింది. కానీ, కరోనా నుంచి ముందుగానే రక్షించే సామర్థ్యంపై తర్వాతి ట్రయల్స్‌లో తేలనుంది. దాని కోసం తదుపరి దశలో సుమారు 10వేల మంది, అమెరికాలో 30వేలమంది, బ్రెజిల్‌లో ఐదువేల మందిపై ట్రయల్స్ నిర్వహించనుంది. తాజా ఫలితాల ప్రకారం, పార్టిసిపెంట్లకు వ్యాక్సిన్ అందించగా 14 రోజుల్లో టీ సెల్స్, 28 రోజుల్లో యాంటీబాడీలు అత్యధికంగా అభివృద్ధి చెందాయి. యాంటీబాడీలతోపాటు టీ సెల్స్‌ను పెంచుతున్నట్టు ప్రకటించిన ఈ ఫలితాల పట్ల సంతోషంగా ఉన్నట్టు ఆక్స్‌ఫర్డ్ పరిశోధక బృందానికి చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ పొల్లార్డ్ తెలిపారు. అయితే, ఈ వ్యాక్సిన్ అనుకున్నట్టుగా పనిచేస్తుందా? ముందస్తుగా కరోనా నుంచి రక్షణ కవచంగా పనిచేస్తుందా? అనేదానికోసం అందరితోపాటు తామూ ఎదురుచూస్తున్నామని వివరించారు.
టీ సెల్స్ అంటే..
ఇప్పటివరకు చాలా వరకు వ్యాక్సిన్‌లు యాంటీబాడీలపైనే దృష్టిపెట్టాయి. మన బాడీలోని రక్షణ వ్యవస్థలో ఇది ఒక పార్ట్ మాత్రమే. యాంటీబాడీలు మన ఇమ్యూన్ సిస్టమ్ అభివృద్ధి చేసే చిన్న చిన్న ప్రోటీన్లు. ఇవి వైరస్ ఉపరితలానికి అతుక్కుని వాటిని అంతమొందిస్తాయి. కానీ, టీ సెల్స్ తెల్లరక్త కణాల్లోని ఓ రకం. ఇవి మొత్తం ఇమ్యూన్ సిస్టమ్‌కే మార్గదర్శనం చేస్తాయి. దేహంలోని ఏ కణాలు వైరస్ బారిన పడ్డాయో గుర్తించి నాశనం చేస్తాయి. ఇటీవలే ఓ అధ్యయనంలో వైరస్ నుంచి కోలుకున్నవారిలో ఆ యాంటీబాడీలు మూడు నెలలకు మించి నిలవడం లేదని తేలింది. అందుకే వారు మళ్లీ వైరస్ బారిన పడే అవకాశమున్నదని, ఇది అంతులేని వలయంగా మారే ప్రమాదమున్నదని హెచ్చరించింది. దీనికి పరిష్కారం హెర్డ్ ఇమ్యూనిటీ పెంపొందించుకోవడం లేదా, టీ సెల్స్ లెవల్స్ అత్యధికంగా ఉండేలా చూసుకోవడమని వివరించింది.
ఇండియాలో వంద కోట్ల డోస్‌ల ఉత్పత్తి
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈ టీకాను ఆస్ట్రా జెనెకా ఫార్మాతో కలిసి అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మనదేశంలోని పూణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రా జెనెకాతో ఉత్పత్తిలో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. మనదేశంలోనే ఒక బిలియన్ డోస్‌లను తయారుచేసే ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నట్టు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఈ వ్యాక్సిన్ భారత అవసరాలకు, అలాగే, మధ్య, స్వల్ప ఆదాయ దేశాలకు అందిస్తామని వివరించారు. ఆగస్టు నుంచి ఈ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్టు తెలిసింది.
వచ్చే నెలలో రష్యా వ్యాక్సిన్..
ప్రపంచంలో తొలి వ్యాక్సిన్‌ను రష్యా తయారుచేయబోతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. రష్యా అభివృద్ధి చేస్తున్న టీకా మనుషుల్లో ఎలాంటి ముప్పును కలిగించలేదని, అలాగే, రోగనిరోధక శక్తిని పెంచుతుందని వారు వివరించారు. రష్యా రక్షణ శాఖకు చెందిన 48వ సెంట్రల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ హెడ్ సెర్జీ బొరిసెవిచ్ ఆ దేశ డిఫెన్స్ మినిస్ట్రీ అధికారిక పత్రికలో కీలక ప్రకటన చేశారు. రష్యా టీకాపై క్లినికల్ ట్రయల్స్ బుర్డెంకో ఆస్పత్రిలో ఇవ్వాళ్టితో(20వ తేదీనాటికి) పూర్తయ్యాయని తెలిపారు. 20మంది వాలంటీర్ల రెండో లేదా చివరి బృందాన్ని మిలిటరీ హాస్పిటల్ నుంచి విడుదల చేశామని వివరించారు. వ్యాక్సినేషన్ తర్వాత పార్టిసిపెంట్లలో ఇమ్యూన్ రెస్పాన్స్ సానుకూలంగా ఉన్నదని, అలాగే, మనుషులకు ఇది సురక్షితమేనని ట్రయల్స్ డేటా స్పష్టం చేస్తున్నదని వెల్లడించారు. ఫలితాలు వచ్చినప్పటికీ ఇంకా చాలా పరిశోధన చేయాల్సి ఉన్నదని ఆయన పేర్కొన్నారు. అయితే, వ్యాక్సిన్ మూడో దశ, క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు ముందే ఈ టీకాను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఆ దేశ ఆరోగ్య శాఖ అంతకుముందు రోజే ప్రకటించడం గమనార్హం. ఈ టీకా మూడో దశ ట్రయల్స్ వచ్చే నెల మూడో తేదీన మొదలుపెట్టనున్నట్టు మరో అధికారి వెల్లడించారు. దీంతో వచ్చే నెలలోనే ఈ టీకా ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తున్నది.