200 మంది పోలీసులకు వికాస్ దుబేతో లింక్?

by Anukaran |   ( Updated:2020-07-07 11:15:57.0  )
200 మంది పోలీసులకు వికాస్ దుబేతో లింక్?
X

దిశ, లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పూర్‌ ఎన్‌కౌంటర్ కేసులో ప్రధాన నిందితుడు, 60 కేసులున్న రౌడీ షీటర్‌ వికాస్ దుబేతో 200 మంది పోలీసులకు లింక్ ఉన్నట్టు అనుమానాలున్నాయి. ఆ 200 మంది పోలీసులపై దర్యాప్తు సాగుతున్నది. కాన్పూర్ జిల్లా చౌబెపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బిక్రూ గ్రామంలో క్రిమినల్ వికాస్ దుబేను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపై వికాస్ ముఠా కాల్పులు జరపడంతో డీఎస్పీ సహా ఎనిమిది మంది స్పాట్‌లోనే చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ గురించి ముందస్తుగానే వికాస్‌కు సమాచారం అందినట్టు యూపీ పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 200 మంది పోలీసులకు వికాస్‌తో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నారు.

ఇప్పటికే చౌబెపూర్, బిల్‌హార్, కాక్వాన్, శివరాజ్‌పూర్ స్టేషన్‌ల నుంచి 10 పోలీసులను సస్పెండ్ చేశారు. కాగా, తనపై దర్యాప్తు ముమ్మరమైతే బిక్రూ గ్రామంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతారని వికాస్ దుబే ఏకంగా ఓ పోలీసునే బెదిరించిన విషయం దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న దుబేను పట్టుకోవడానికి సుమారు 100 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. కాగా, ఇద్దరు స్థానిక బీజేపీ నేతలతో వికాస్ దుబేకు సంబంధాలున్నట్టు చెబుతున్న ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలైంది.

Advertisement

Next Story

Most Viewed