‘వేతనాలు ఇవ్వని ఏజెన్సీని తొలగించాలి’

by Shyam |
‘వేతనాలు ఇవ్వని ఏజెన్సీని తొలగించాలి’
X

దిశ, హైదరాబాద్: నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న, ఆంధ్రా ఏజెన్సీని వెంటనే తొలగించి తమకు సక్రమంగా వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేట్లబుర్జు హాస్పిటల్‌లో పేషంట్ కేర్ సర్వీస్ ప్రొవైడర్ కింద ఉద్యోగాలు చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ… 2017 సెప్టెంబర్ నెలలో తమను జిల్లా కలెక్టర్ ఎంపిక చేసి శ్రీ వెంకటేశ్వర వీరాంజనేయ మ్యాన్ పవర్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు అప్పగించారు. దీంతో పేట్లబుర్జు ఆస్పత్రిలో పనులు కేటాయించారు. పేషంట్ కేర్ సర్వీస్ ప్రొవైడర్ పరిధిలో మొత్తం 34 మంది సిబ్బంది ఉండగా, వీరిలో ఆరుగురు స్టాఫ్ నర్సులు ఉన్నట్టు తెలిపారు. అయితే నియామకం అయిన నాటి నుంచి వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదని, ఆరు నుంచి ఎనిమిది నెలలకు ఒకసారి రెండు నెలల జీతాలు మాత్రమే ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ముందుగా చెప్పిన ప్రకారం రూ.12 వేల జీతం ఇవ్వవలసి ఉండగా, కోతలు విధించి కేవలం రూ.10,250 మాత్రమే చేతికి ఇస్తున్నారని వాపోయారు. దీంతో ఇంటి అద్దెలకు ప్రతి నెలా అప్పులు చేసి చెల్లించాల్సి వస్తోందన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఉపాధి కల్పనా కార్యాలయాలలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. చివరకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పాటు జిల్లా కలెక్టర్‌కు కూడా వేతనాల విషయంలో లేఖ రాశామని, అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ఇటీవల ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులలో వేతనాలు పెంచిన మాదిరిగానే తమకు కూడా వేతనాలు పెంచి, ప్రతి నెలా 5వ తేదీన ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed