తెలంగాణ యూనిర్సిటీలో మొదలైన యుద్ధం.. డబ్బులిస్తారా.. ఉద్యోగాలా..?

by Shyam |
తెలంగాణ యూనిర్సిటీలో మొదలైన యుద్ధం.. డబ్బులిస్తారా.. ఉద్యోగాలా..?
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ పేరుతో ఏర్పడిన యూనివర్సిటీ పరువు నానాటికీ తీసికట్టుగా మారింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత యూనివర్సిటీ తిరోగమనంలోకి వెళ్లిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైస్ చాన్స్‌లర్స్, రిజిస్ట్రార్లు, పాలకమండళ్లు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉపకులపతి రవీందర్ గుప్తా నియమితులైన తర్వాత 113 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకం పెద్ద వివాదానికి తెరతీసింది.

యూనివర్సిటీ ఉద్యోగాలలో చేరిన కొందరు 2 నెలలు అపాయింట్ మెంట్ లెటర్ లేకుండానే విధులు నిర్వహించారు. వారికి వేతనాలు ఇచ్చే సమయంలో పాలకమండలి అనుమతి లేకపోవడంతో ఈ వివాదం అగ్గిరాజేసింది. అక్టోబర్ 27, నవంబర్ 27వ తేదిన జరిగిన ఈసీ సమావేశంలో ఔట్ సోర్సింగ్ నియామకాలు లేవని దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో2 నెలలు విధులు నిర్వహించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

తెలంగాణ విశ్వవిద్యాలయంలో 113 మంది ఉద్యోగుల నియామకం వెనుక పెద్ద ఎత్తున పైరవీలు జరిగాయి. ప్రజాప్రతినిధులు కొందరు, ఈసీ సభ్యులు, అధికారులు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీస్ ద్వారా నియామకాలు చేశారు. వీటి వెనుక పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ వారి చెప్పుచేతుల్లో ఉండటంతో నియామకపు ఉత్తర్వులను అడ్డు పెట్టుకుని పోస్టింగ్‌కు రూ.లక్షల్లో వసూలు చేశారని విమర్శలు వచ్చాయి. 53వ మొదటి పాలకమండలి సమావేశానికి ముందు ఈ వివాదం చెలరేగగా.. అధికారులు ఈసీ సమావేశంలో నియామకదారులను ఒప్పిస్తామని భరోసా కల్పించడంతో బాధితులు ఆందోళన చేయలేదు. అయితే, మీటింగ్‌లో అధికారుల పాచిక పారలేదు. మొదటి పాలక మండలి సమావేశంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు అక్కర్లేదని ఖరాఖండిగా తేల్చేశారు. గత నెలలో జరిగిన రెండో పాలకమండలి సమావేశంలో నియామకాలు చేయిస్తామని హామీ ఇచ్చినా అక్కడ కూడా చుక్కెదురైంది.

రెండు పాలకమండలి సమావేశాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో 2 నెలల పాటు విధులు నిర్వహించిన నియామకదారుల గురించి ఎటువంటి ప్రకటన లేకపోవడంతో వారు ఆందోళన చెందారు. రెండో పాలకమండలి సమావేశం అనంతరం అధికారులు, తాము డబ్బులు ఇచ్చిన మధ్యవర్తుల కొరకు వెతుకులాట ప్రారంభించారు. సోమ, మంగళ, బుధవారాల్లో బాధితులు యూనివర్సిటీకి వచ్చి నియామకాల గురించి వాకబు చేశారు. రెండు రోజుల్లో స్పష్టత రాకపోతే తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అందరూ ఏకమౌతున్నట్లు తెలిసింది. ఎవరి ద్వారా డబ్బులను ఇచ్చామో వారిని నిలదీయాలని కచ్చితంగా డబ్బులను వెనక్కి తీసుకోవాలనే పంతంతో నిరుద్యోగులున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం యూనివర్సిటీలో పెద్ద దుమారమే రేపుతోంది. మొన్నటివరకు రిజిస్ట్రార్ తొలగింపు, కొత్త రిజిస్ట్రార్ నియామకం వరకు వివాదాలు చెలరేగగా.. ఇప్పుడు యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యోగాల కొరకు ఇచ్చిన డబ్బులను తిరిగి వసూలు చేసుకునేందుకు ఉద్యమించడం విశ్వవిద్యాలయం చరిత్రలో తొలిసారి అని చెప్పవచ్చు.ఈ వ్యవహారం మున్ముందు ఎక్కడివరకు వెళ్తుందో తెలియని పరిస్థితి.

Advertisement

Next Story

Most Viewed