తెలంగాణ తర్వాతే మిగతా రాష్ట్రాలు..

by Shyam |
తెలంగాణ తర్వాతే మిగతా రాష్ట్రాలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ.. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హరితహారం, కొవిడ్ వారియర్స్, వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ఈరోజు కేటీఆర్.. అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైఫ్ సైన్సెస్, కన్‌స్ట్రక్షన్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ అగ్రగామిగా ఉందన్నారు. పెట్టబడులకు రాజధాని స్వర్గధామంగా మారిందన్నారు.

నిర్మాణ రంగంలోనూ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ మెరుగ్గా ఉందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లు ఉంటే.. ప్రస్తుతం 1.40 లక్షల కోట్లకు చేరాయని అన్నారు. ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్‌కు విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామని, తెలంగాణ ఇన్నోవేషన్ హబ్‌గా మారుతోందని వెల్లడించారు. 24 గంటల కరెంటు.. గోదాముల పెంపుతో దేశంలోనే తెలంగాణ రూ.లక్ష కోట్ల వ్యవసాయ ఉత్పత్తికి చేరిందని వివరించారు. రాష్ట్రంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

దేశంలోనే హైదరాబాద్‌లో అతిపెద్ద ఫార్మాస్యూటికల్ పార్కు, టెక్స్‌టైల్ పార్కు వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి హైదరాబాద్ బలమైన కేంద్రమన్నారు. కేంద్రం ఐటీఐఆర్ ప్రాజెక్టును విస్మరించిందని, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ.. వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని మోసం చేసిందని మంత్రి పేర్కొన్నారు. బుల్లెట్, హైస్పీడ్ ట్రెయిన్లు గుజరాత్‌కే వెళ్తున్నాయని, తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపిందని తెలిపారు.

Advertisement

Next Story