దేశానికే ఆదర్శంగా తెలంగాణ వైద్య సేవలు: హరీశ్ రావు

by Shyam |
harish rao
X

దిశ ప్రతినిధి, మెదక్: వైద్య రంగంలో పేదలకు సేవలందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డితో కలిసి శనివారం మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని 70 ఏళ్లు పాలించిన గత ప్రభుత్వాల హయాంలో కుంటుపడిన ఆసుపత్రులను, ఇయ్యాల టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.

దుబ్బాక లో వంద పడకల ఆసుపత్రి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దివంగత రామలింగారెడ్డి కోరిక, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వరం దుబ్బాకలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దుబ్బాక మీద చాలా ప్రేమ అని, దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషిస్తారన్నారు. స్వర్గీయ మాజీ మంత్రి ముత్యంరెడ్డి హయాంలో కానీ పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక దుబ్బాకలో చేసుకుంటున్నామన్నారు. కరోనా వ్యాక్సిన్ పై అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని, 18 ఏండ్లు దాటిన వారు తప్పనిసరి కరోనా వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు. ఒమిక్రాన్ వైరస్ తో ప్రపంచం వణుకుతున్నదని, అది పోవాలంటే మాస్క్ తప్పనిసరి పెట్టుకోవాలన్నారు. కేంద్రం నుంచి అనుమతి వస్తే మూడో డోస్ వేసుకుందామన్నారు.

దుబ్బాకకు వరాల జల్లు….

దుబ్బాకలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవంలో భాగంగా ప్రసంగించిన మంత్రి దుబ్బాకకు వరాల జల్లు కురిపించారు. బస్తీ దవాఖాన, మార్చురీ కై ఫ్రీజర్, రక్తనిధి నిల్వ కేంద్రం, డయాలసిస్ కేంద్రం, 10 పడకల ఐసీయూ, ఆసుపత్రి చుట్టూ కాంపౌండ్ వాల్, వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి కావాల్సిన వైద్య సిబ్బంది, దుబ్బాక మున్సిపల్ కు రెండు వైకుంఠ రథాలు, ఎస్ఎన్ సీయూ-నవజాత శిశువు కేంద్రం మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు.

సిద్దిపేట తరహా అభివృద్ధి చెందాలి… ఎమ్మెల్యే రఘునందన్ రావు

సిద్దిపేట తరహా దుబ్బాకలో వైద్య విధాన పరిషత్‌ను డెవలప్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు. వంద పడకల ఆసుపత్రిలోని వైద్య సిబ్బందికి క్వార్టర్‌లు మంజూరు చేయాలని, దుబ్బాకకు ఒక డయాలసిస్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మిరుదొడ్డిలో యునాని ఆసుపత్రిని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, యాదవ రెడ్డి, టీఎస్ఎంఐడీఎస్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, ఇతర ప్రజాప్రతినిధులు, వైద్య అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed