గుడ్‌న్యూస్.. త్వరలో గాంధీ ఆస్పత్రిలో ఓపీ సేవలు

by Anukaran |
గుడ్‌న్యూస్.. త్వరలో గాంధీ ఆస్పత్రిలో ఓపీ సేవలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ ఆస్పత్రిలో అన్ని రకాల సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను చేపట్టింది. త్వరలోనే వైద్యశాఖకు ఆదేశాలు జారీ చేయనున్నారు. కరోనా పేషెంట్లు భారీగా తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే తగిన చర్యలు చేపడుతామని ఆసుపత్రి సిబ్బంది తెలుపుతున్నారు. ప్రస్తుతం ఐసియు వార్డులో అత్యధికంగా 475 మంది పేషెంట్లు ఉన్నారు. మొత్తం 1869 బెడ్లు ఉండగా 506 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు.

ఏప్రిల్, మే నెలలో కరోనా వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కొవిడ్ సేవలకు మాత్రమే పరిమితం చేశారు. గాంధీతో పాటు కింగ్ కోఠి, టిమ్స్ ఆసుపత్రుల్లో కూడా విసృతంగా కరోనా చికిత్సలను అందించారు. బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు కూడా చికిత్సలు అందిస్తున్నారు. జూన్ మొదటి వారం నుంచి కరోనా కేసులు భారీగా తగ్గిపోవడంతో గాంధీలో పేషెంట్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. దీంతో అన్ని రకాల చికిత్సలను అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.

గాంధీలో 1869 బెడ్లలో 506 మందికి చికిత్సలు..

గాంధీ ఆసుపత్రిలో మొత్తం 1869 బెడ్లు ఉండగా ప్రస్తుతం 506 మంది పేషేంట్ల మాత్రమే చికిత్సలు పొందుతున్నారు. జనరల్ బెడ్లు 650 ఉండగా వీటిలో 19 మంది చికిత్సలు పొందుతుండగా 631 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్లు 600 ఉండగా 12 మంది మాత్రమే చికిత్సలు పొందుతుండగా 475 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఐసీయూ వార్డులో 619 బెడ్లు ఉండగా వీటిలో ఎక్కువగా 474 మంది పొందుతుండగా 145 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల పేషెంట్లకు చికిత్సలు అందించేందుకు ఆసుపత్రి సిబ్బంది సిద్ధం అవుతున్నారు.

2 నెలలుగా నిలిచిన ఓపీ సేవలు..

దాదాపుగా రెండు నెలల నుంచి గాంధీలో అన్ని రకాల ఓపీ సేవలు నిలిపివేశారు. కేవలం కరోనా, బ్లాక్ ఫంగస్ రోగాలకు మాత్రమే చికిత్సలు అందిస్తున్నారు. దీంతో పేద ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. డయాలసిస్ పేషెంట్లు, గర్భిణీలు, చిన్న పిల్లలకు చికిత్సల కోసం ఇతర ప్రైవేట్ ఆసుపత్రులను సంప్రదించాల్సి వచ్చింది. పలు అత్యవసర కేసులు, ఆక్సిడెంట్ బాధితులు ఇతర ఆస్పత్రులకే వెళ్లారు. ఈ క్రమంలోనే గాంధీకి ప్రత్యామ్నాయంగా ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి పేషేంట్ల తాకిడి పెరిగింది. అక్కడి సిబ్బందిపై కూడా ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే గాంధీ ఆస్పత్రిలో ఓపీ సేవలు తిరిగి ప్రారంభిచనున్నారు.

Advertisement

Next Story