- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశప్రతినిధి , హైదరాబాద్ : బ్లాక్ ఫంగస్ కేసులకు వైద్యం అందించడానికి కోఠి ENT ఆస్పత్రిని నోడల్ హాస్పిటల్‌గా ఏర్పాటు చేయడంతో చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. బ్లాక్ ఫంగస్ రోగులకు ENT ఆస్పత్రిని కేటాయించక ముందు ప్రతిరోజూ ఇక్కడ 1000 నుండి 1500 వరకు రోగులు వచ్చేవారు. అయితే, సుమారు పది రోజులుగా ఆయా జబ్బులతో హాస్పిటల్‌కు వచ్చే వారు తగ్గిపోయారు. ENT సేవలు నిలిపి వేయనప్పటికీ బ్లాక్ ఫంగస్ రోగులతో ఆస్పత్రి నిండిపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో చెవి, ముక్కు, గొంతు సమస్యల కోసం ఆస్పత్రికి వెళ్లడం సరికాదని ప్రజల్లో అవగాహన పెరగడం వల్లే రద్దీ తగ్గినట్లు తెలుస్తోంది.
అత్యవసరమైతేనే..
గతంలో ENT ఆస్పత్రిలో చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం తెల్లవారు జామునుండే రోగులు బారులు తీరేవారు. ముఖ్యంగా ఓపీ విభాగంలో చూపించుకునే వారు అత్యధికంగా ఉండడంతో పడరాని పాట్లు పడేవారు. అయితే, బ్లాక్ ఫంగస్ రోగుల ఓపీ ఒక్కసారిగా పెరిగిపోగా ఈఎన్టీ జబ్బుల కోసం వచ్చే వారి సంఖ్య ఒక్కసారిగా పడిపోయింది. అంతేకాకుండా గతంలో హాస్పిటల్‌లోని ఐదు ఆపరేషన్ టేబుళ్లపై నిత్యం 15 నుండి 20 వరకు శస్త్ర చికిత్సలు జరిగేవి. తాజాగా ఇక్కడ అత్యవసర శస్త్ర చికిత్సలు మినహా ఇతర ఆపరేషన్లు నిలిచిపోయాయి. సుమారు పది రోజులుగా ఒక్క సర్జరీ కూడా చేయకపోగా, కాక్యులార్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి.
మూడంకెలకు చేరని ఓపీ..
బ్లాక్ ఫంగస్ రోగులకు నోడల్ ఆస్పత్రిగా ENTని ప్రకటించిన ఈ నెల 18వ తేదీ నుండి శుక్రవారం వరకు కలిపి 148 మంది రోగులు మాత్రమే ఓపీ విభాగంలో చికిత్స తీసుకున్నారు. గడచిన 10రోజుల్లో 18 శస్త్ర చికిత్సలు మాత్రమే జరిగాయి. అంతకుముందు సాధారణంగా ప్రతి రోజూ 1500 వరకు ఉండే ఓపీ పది రోజుల్లో ఏ రోజు కూడా మూడంకెల సంఖ్య దాటక పోవడం గమనార్హం. బ్లాక్ ఫంగస్‌కు ముందు కేవలం రెండు గంటల వ్యవధిలో సుమారు 200 మంది రోగులను ఓపీ విభాగంలో వైద్యులు పరీక్షించే వారు. అయితే, పది రోజులుగా మొత్తం 148 రోగులు మాత్రమే హాస్పిటల్‌కు రావడం, సర్జరీలు కూడా ఇదే తీరులో ఉండటం చూస్తుంటే చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడేవారు ENT ఆస్పత్రికి రావాలంటే ఎంతగా జంకుతున్నారో అర్థమవుతోంది.
ENT ఓపీ, శస్త్ర చికిత్సల వివరాలు..
తేదీ ఓపీ శస్త్ర చికిత్సల కౌంట్
18.05.2021 24 02
19.05.2021 15 05
20.05.2021 20 02
21.05.2021 10 03
22.05.2021 19 01
24.05.2021 19 03
25.05.2021 12 01
26.05.2021 08 నిల్
27.05.2021 13 నిల్
28.05.2021 08 01
సేవలు నిలిపి వేయలేదు..
పదిరోజుల క్రితం వరకు చెవి, ముక్కు, గొంతు జబ్బులకు నిత్యం సుమారు 1000 నుండి 1500 వరకు ఓపీ రద్దీ ఉండేది. ప్రస్తుతం ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ ఇస్తుండటం, ఆ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఈఎన్టీ ఓపీ తగ్గిపోయింది. అయితే, చెవి, ముక్కు, గొంతు రోగులకు రెగ్యూలర్‌గా ఉండే చికిత్సను నిలిపివేయలేదు. అత్యవసర కేసులకు మాత్రమే శస్త్ర చికిత్సలు సైతం చేస్తున్నాం. ప్రమాదమేమి లేని రోగులకు చేసే ఆపరేషన్లను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. బ్లాక్ ఫంగస్ వల్లే చెవి, ముక్కు, గొంతు సంబంధిత జబ్బులతో ఆస్పత్రికి వచ్చేవారు తగ్గిపోయారు.