సంక్షేమ, సుపరిపాలనలే సోపానాలు

by Shamantha N |
సంక్షేమ, సుపరిపాలనలే సోపానాలు
X

భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యం శ్రేయో రాజ్య భావనను కలిగి ఉంటుంది. రాజ్యంలోని ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి కృషి చేయడం ప్రభుత్వ విధి. అయితే, కేవలం సంక్షేమంతోనే రాజ్యాధికారం సాధ్యమనుకోవడం పొరపాటనీ, పాలన కూడా ముఖ్యమని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిరూపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐఆర్ఎస్ అధికారి అయిన కేజ్రీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం కృషి చేయడంలో, వారి మద్దతును కూడగట్టడంలో తనదైన ముద్ర వేసుకున్నారని పరిశీలకులు చెబుతున్నారు.

సంక్షేమం ఒక్కటే గట్టెక్కిచ్చేనా?

తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం గురించి పెద్దమొత్తంలోనే ఖర్చు పెడుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా సంక్షేమం పేరిట ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’తో రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నది. అయితే, సంక్షేమం ఒక్కటే రాజకీయ అధికారంలో ఉండటానికి సరిపోదనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. వాటిని పరిశీలిద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆనాటి సీఎం ఎన్టీరామరావు రెండు రూపాయలకే కిలో బియ్యం సంక్షేమ పథకం పెట్టారు. ప్రజల్లోకి వెళ్లి బలమైన మెజార్టీతో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకొచ్చారు. కానీ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ పసుపు కుంకుమ, రైతులకు పెట్టుబడి సాయం, పింఛన్ల పెంపు, ఎన్టీఆర్ సుజల స్రవంతి వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. కానీ, ఆయనా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో నెగ్గలేకపోయారు. ప్రతిపక్ష పాత్రకే పరిమితమయ్యారు.

తెలంగాణ పరిస్థితి ఇందుకు భిన్నం. ఉమ్మడి ఏపీ విభజన సందర్భంగా నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే తెలంగాణ అంధకారమయమవుతుందని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన భాషలో చెప్పాలంటే ‘‘రెప్ప పాటు కూడా కరెంటు పోకుండా చేయడం’’ కాకపోయినా, కరెంటు గురించి ఆందోళనలు ఎక్కడా జరగలేదు. విద్యుత్ సరఫరా బాగానే జరిగింది. ఇదొక్కటే కాదు కళ్యాణలక్ష్మి, రైతుబంధు, మిషన్ భగీరథ వంటి పథకాలతో పాటుగా బలమైన పాలన అందించినట్టు ఆయన ప్రచారం చేసి ముందస్తు ఎన్నికల్లో నెగ్గాడు. అయితే, కేసీఆర్ కేవలం సంక్షేమ పథకాలే కాకుండా పాలన విషయంలో కూడా చర్యలు తీసుకోవడమే మళ్లీ ఎన్నికల్లో నెగ్గారని అంచనా.

గణనీయ మార్పు..

దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, సుపరిపాలన విద్య, వైద్య రంగాల్లో గణనీయ మార్పు తెచ్చింది. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ, మొహల్లా క్లినిక్‌ల పేరిట సామాన్యులకు వైద్యం, 20 లీటర్ల నీరు, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం చేయడం పైగా ఇవన్నీ బడ్జెట్‌లో లోటు లేకుండా పూరించడం.. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ప్రజల్లో గుర్తింపు తెచ్చిపెట్టింది.

మహిళాసాధికారిత దిశగా..

రాజకీయ పార్టీలు మహిళాసాధికారితకు కృషి చేస్తున్నాయని చెప్పడమే తప్ప ఆచరణలో పెద్దగా ప్రయత్నించినట్టు కనిపించడం లేదనీ, ఆప్ మాత్రం ఆ దిశగా ఓ గొప్ప అడుగు వేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే ఢిల్లీ మెట్రో, బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా ఈ చర్య మహిళలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేస్తుందనీ, వారిని వారి కలల సాకారం చేసుకునేందుకు ఉపయోగపడే ప్రోత్సాహకంగా ఉంటుందని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వైఖరి

ఓ వైపు ఢిల్లీలో మహిళలకు ఉచిత రవాణా అందిస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లో ఇందుకు భిన్న వైఖరి కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సుల చార్జీలు పెంచడం సామాన్యుల నడ్డీ విరిచే చర్యలు ఇక్కడ సాగుతున్నాయి. అంతేగాకుండా బస్సుల సంఖ్య తగ్గింపు కూడా జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 1,000 ఆర్టీసీ బస్సులు తగ్గాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలోని రాష్ట్రాల ప్రభుత్వాలు కేవలం సంక్షేమానికే కాకుండా, సుపరిపాలన దిశగా అడుగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed