ఆన్‌లైన్ గేమింగ్‌‌తో మానసిక ఆరోగ్యం

by Shyam |   ( Updated:2021-12-24 07:33:24.0  )
online gaming
X

దిశ, ఫీచర్స్: జీవితంలో ఒత్తిడి తగ్గించుకునేందుకు ‘యోగా, మెడిటేషన్, జాగింగ్’ వంటి అనేక మార్గాలున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే జాబితాలో మరో యాక్టివిటీ చేరింది. మానసిక ఆరోగ్య నిపుణులు సైతం మానసిక రోగులకు ఆన్‌లైన్ గేమింగ్‌ను సజెస్ట్ చేస్తున్నారు. పాండమిక్ టైమ్‌లో విధించిన లాక్‌డౌన్స్‌, అనుభవించిన సామాజిక ఒంటరితనం చాలా మందిలో ఆరోగ్య సమస్యలకు కారణమైంది. అదే టైమ్‌లో థెరపిస్ట్‌లు సైతం పర్సనల్ థెరపీ సెషన్స్ నుంచి ఆన్‌లైన్‌ ఇంటరాక్షన్‌కు మారాల్సి రావడంతో ఈ కొత్త టెక్నిక్ వెలుగుచూసింది.

కొన్ని వీడియో గేమ్స్‌‌ యూజర్లను వ్యసనపరులుగా మార్చే లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ.. గేమింగ్ అనేది వాస్తవ-ప్రపంచ ఒత్తిళ్ల నుంచి ఉపశమనాన్ని అందించగలదని పరిశోధనలో తేలింది. సాంప్రదాయ టాక్ థెరపీని గేమింగ్‌తో మిళితం చేయడం వల్ల మానసిక సమస్యలతో బాధపడుతున్న రోగులకు సులభంగా చికిత్స అందించడంలో కావలసిన సహకారం అందుతుందని స్పష్టమైంది. అందుకే వైద్యులు.. రోగులను ఒంటరిగా లేదా Roblox, Minecraft వంటి మల్టీప్లేయర్ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో గ్రూప్‌గా అయినా ఆడేందుకు ప్రోత్సహిస్తున్నారు.

ఒక ప్రవాహ అనుభూతిని పొందుతారు..

పాండమిక్ టైమ్‌లో ఆన్‌లైన్ గేమింగ్ అనేది బెస్ట్ థెరపీగా తెరపైకి వచ్చింది. అయితే లాభాపేక్షలేని ‘గీక్ థెరపీ’ వంటి సంస్థలు దశాబ్దాల కిందటి నుంచే థెరపిటిక్, ఎడ్యుకేషన్‌తో పాటు కమ్యూనిటీ ప్రాక్టీస్‌లో వీడియో గేమింగ్‌ను ఉపయోగించడాన్ని సమర్థిస్తున్నాయి. మనస్తత్వవేత్తలు దీన్ని ఒక ‘ప్రవాహం(ఫ్లో)’గా సూచిస్తారు. ఆటలో మునిగిపోయినప్పుడు కలిగే అనుభూతి.. నిజ జీవితంలో వారు అనుభవిస్తున్న ఫీలింగ్స్, సమస్యలు, చింతలను నిరోధించడంలో సాయపడుతుంది. అలాగే ఏకాగ్రతను పెంచి మైండ్‌ఫుల్‌నెస్‌ను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఆటగాళ్లు.. గేమ్‌లో సాధారణ టాస్క్‌లు లేదా లెవెల్స్ కంప్లీట్ చేస్తున్నప్పుడు మానసిక స్థితిని మెరుగు పరిచే హ్యాపీనెస్ హార్మోన్ (డోపమైన్) విడుదలవుతుంది. ఇక ఆన్‌లైన్‌లో ఇతరులతో ఇంటరాక్షన్ కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచి సామాజిక నైపుణ్యాల అభివృద్ధికి సాయపడుతుంది.

అదనపు సాధనంగా ఆన్‌లైన్ గేమింగ్

క్లినికల్ సైకాలజిస్ట్, రచయిత ఐమీ డామస్ ప్రకారం.. ఆన్‌లైన్ గేమింగ్ సెషన్స్ సామాజిక నైపుణ్యాలను పెంచడం లేదా బాధను తట్టుకోవడం వంటి నిర్దిష్ట చికిత్స లక్ష్యాలను కలిగి ఉండాలి. మానసిక ఆరోగ్యానికి చికిత్స చేసే సాంప్రదాయ పద్ధతులకు ఆన్‌లైన్ గేమింగ్ ప్రత్యామ్నాయం కానప్పటికీ, మహమ్మారి కారణంగా పెరుగుతున్న మెంటల్ హెల్త్ చాలెంజెస్ పరిష్కారానికి థెరపిస్టులకు ఉపయోగకరమైన అదనపు సాధనంగా భావించవచ్చు.

Advertisement

Next Story