నెలకు రూ. 75 వేలు సంపాదిస్తున్న ఏడాది బుడ్డోడు

by Shyam |   ( Updated:2021-10-21 02:44:13.0  )
Child-11
X

దిశ, ఫీచర్స్: ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనగానే కామన్‌గా టీనేజర్స్ లేదా యంగ్ పర్సన్స్‌ అయ్యుంటారని ఫిక్స్ అయిపోతాం. అందులోనూ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఇంకాస్త ఎక్కువే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ యూఎస్‌లో మాత్రం ఏడాది వయసున్న బుడ్డోడు ‘ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్’గా సోషల్ మీడియాలో ఫేమ్ సంపాదించాడు. తల్లిదండ్రులతో కలిసి US మొత్తం చుట్టేస్తూ నెలకు $ 1,000 (రూ. 75,000) సంపాదిస్తున్నాడు. ఇప్పటికే 45 విమానాల్లో ప్రయాణించిన ‘బేబీ బ్రిగ్స్ డారింగ్టన్’.. 16 యూఎస్ రాష్ట్రాలను సందర్శించాడు. ఈ క్రమంలో అలస్కాలోని ఎలుగుబంట్లు, ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లోని తోడేళ్లను, ఉటాలోని డెలికేట్ ఆర్చ్‌తో పాటు కాలిఫోర్నియాలోని బీచ్‌లను చూసేశాడు.

14 అక్టోబర్, 2020న జన్మించిన బ్రిగ్స్ మూడు వారాల వయసులోనే ట్రావెలింగ్ మొదలుపెట్టాడు. నెబ్రాస్కాలోని ఒక గ్లాంపింగ్ సైట్ అతని మొదటి పర్యటన కాగా.. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప్రశంసలు దక్కించుకున్నాడు. దీని వెనకున్న స్టోరీ విషయానికొస్తే.. పార్ట్ టైమ్ టూరిస్ట్స్ అనే బ్లాగ్ నడిపే బ్రిగ్స్ తల్లి.. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా పర్యటించేది. కానీ తను 2020లో గర్భం దాల్చినప్పుడు బేబీతో పర్యటించడం సాధ్యంకాదని, ఇక తన కెరీర్ ముగిసినట్లేనని భావించింది. అయితే ఆమె భర్త స్టీవ్ ప్రోత్సాహంతో న్యూ బార్న్ బేబీతోనే ప్రయాణించాలని డిసైడ్ అయ్యారు. కానీ బేబీ ట్రావెల్ గురించిన సమాచారం ఎక్కడా లభించలేదు. ఆ తర్వాత నవజాత శిశువుతో తమ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను మొదటిసారి తల్లిదండ్రులైన వారితో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా అకౌంట్ ఏర్పాటు చేయాలని జెస్ నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో బ్రిగ్స్.. సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారడంతో అతని తల్లిదండ్రులను అనేకమంది స్పాన్సర్స్ సంప్రదించారు. ఈ మేరకు ఏడాది వయసున్న బ్రిగ్స్‌కు నెలవారీ $ 1,000 (రూ.75,000) కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాడు. ఇక అతడి ఇతర అవసరాలు తీర్చేందుకు అనేక బ్రాండ్లు డైపర్స్, వైప్స్ కూడా అందిస్తున్నాయి. ఇక ఈ విషయాలపై జెస్ మాట్లాడుతూ.. ‘మా కుమారుడికి ఈ పర్యటనలు గుర్తుండకపోవచ్చు. కానీ పిల్లల ఎదుగుదలకు విభిన్న సంస్కృతులు, భిన్న వాతావరణాలు, ప్రదేశాలు బహిర్గతం చేయడం చాలా ముఖ్యం’ అని చెప్పింది. కాగా రాబోయే ఆరు నెలల్లో ఈ కుటుంబం యూరప్ పర్యటనకు ప్లాన్ చేస్తోంది.

Advertisement

Next Story