చంపేస్తానంటూ వ్యక్తి హల్చల్.. మాజీమంత్రి ఇంటి వద్ద ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2021-09-25 03:49:29.0  )
చంపేస్తానంటూ వ్యక్తి హల్చల్.. మాజీమంత్రి ఇంటి వద్ద ఉద్రిక్తత
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంటి వద్ద మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. సూర్యప్రకాశ్ రెడ్డిని చంపేస్తానంటూ రచ్చరచ్చ చేశాడు. కర్నూలు జిల్లా లద్దగిరిలో సూర్యప్రకాశ్ రెడ్డి నివశిస్తున్నారు. ఆయన ఇంట్లో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వెంటనే సూర్యప్రకాశ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపు ఆగంతకుడు అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. దీంతో సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడుని పోలీసులు గుర్తించారు. నిందితుడు అల్లినగరం గ్రామానికి చెందిన లక్ష్మన్నగా గుర్తించారు. మద్యం మత్తులో ఇలా ప్రవర్తించారని పోలీసులు నిర్ధారించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి స్పందించారు.

తన ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేయడంపై మండిపడ్డారు. తనను చంపేస్తానని బెదిరించాడని చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రిగా పని చేసిన తనలాంటి వారి ఇంటి వద్దకే వచ్చి చంపేస్తామని బెదిరిస్తున్నారని, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. జగన్ ప్రభుత్వంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. తాగుబోతులు రెచ్చిపోతున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అనేది తెలిపేందుకు తన ఇంటి వద్ద జరిగిన ఘటనే ఒక ఉదాహరణ అని కేంద్రమాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి విమర్శించారు.

Advertisement

Next Story