అడవిలో మళ్లీ మొదలైన అలజడి.. మేతకు వెళ్లి తిరిగిరాని పశువులు

by Aamani |   ( Updated:2021-10-02 08:05:34.0  )
అడవిలో మళ్లీ మొదలైన అలజడి.. మేతకు వెళ్లి తిరిగిరాని పశువులు
X

దిశ, కుబీర్ : అభయారణ్యాలలో ఉండాల్సిన పులులు అటవీ సంపద అంతంత మాత్రంగా ఉన్న పలుచని చిట్టడవుల్లో సంచరిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండలం చాతలో పులిసంచారం ఘటన మరువక ముందే, బెల్గాం తండాలో పులి అడుగుజాడలు శనివారం కలకలం సృష్టించాయి. మేత కోసం అడవికి వెళ్ళిన పశువులు తిరిగి ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు వెళ్లి గాలించారు. అక్కడి దృశ్యాలను చూసి వారంతా షాక్‌కు గురయ్యారు.

పులి దాడిలో మృతి చెందిన పశువుల కలేబరాలు అడవిలో కనిపించాయి. వెంటనే గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రేంజ్ ఆఫీసర్ రాథోడ్ రమేష్ ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించగా, అక్కడి అడుగు జాడలను బట్టి పులిగా నిర్ధారించారు. జాదవ్ మిట్టల్, రాజు, జయవంత్‌కు సంబంధించిన పశువులు పెద్దపులి దాడిలో చనిపోయాయన్నారు. ఇక నుంచి గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం సాయంత్రం వేళల్లో చేన్లలోకి వెళ్లవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితిలో బయటకు వెళ్లాల్సి వస్తే నలుగురు, ఐదుగురు కలిసికట్టుగా వెళ్లాలన్నారు. అటవీ ప్రాంతాల్లో పులికి హాని కలిగించేలా విద్యుత్ తీగలను అమర్చవద్దన్నారు. పులి జాడ తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను అమర్చారు. అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ కోటేష్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed