పెళ్లైన రెండో రోజే భర్తను బయటకు పంపి స్నేహితురాలితో వధువు పాడు పని..

by Anukaran |
Bride Escape
X

దిశ, వెబ్‌డెస్క్ : మోసాలు చేయడంలో ఆరి తేరుతున్నారు కొందరు మహిళలు. పక్కా ప్లాన్‌తో మగ మహరాజులను బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లికాని ప్రసాద్‌లను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇటీవల వరస ఘటనలు జరుగుతున్నా.. ఆలస్యంగానైనా అందమైన అమ్మాయి భార్యగా నచ్చిందన్న సంతోషంలో మోసాన్ని గ్రహించలేక పోతున్నారు లేటు మ్యారేజ్ చేసుకునే పెళ్లి కొడుకులు. అనాథ పెళ్లి కూతురుగా ఎంట్రీ ఇచ్చి.. అందిన కాడికి దోచుకోని వెళ్తున్నారు కంత్రీ వధువులు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిని పెళ్లాడి రెండో రోజే నగలు, నగదుతో పరారీ అయింది ఓ నవ వధువు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కూర్మిద్ద గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 40 ఏళ్లు దాటినా వివాహం జరగలేదు. ఈ వయసులో అతడికి సరైన జోడి దొరకకపోవడంతో మిత్రుడి సలహ మేరకు పెళ్లిళ్ల బ్రోకర్‌ను సంప్రదించాడు. అయితే విజయవాడలో ఓ అనాథ యువతి ఉన్నదని, లక్ష రూపాయలు బ్రోకరేజి ఇస్తే ఆమెతో వివాహం జరిపిస్తానని చెప్పాడు. దానికి ఒప్పుకున్న ఆ వ్యక్తి విజయవాడ వెళ్లి సదరు యువతిని చూశాడు. ఆమె అందానికి ఫిదా అయిన అతడు వెంటనే పెళ్లిల బ్రోకర్‌కు రూ.లక్ష ముట్టజెప్పి పెళ్లి ఖాయం చేసుకున్నాడు.

విజయవాడలోని ఓ హోటల్‌లో డిసెంబర్ 16న అనాథ యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి వధువు తరఫున ఆమె స్నేహితురాలుతోపాటు మరో మహిళ వచ్చింది. లగ్నం అనంతరం వధూవరులు యాదగిరి గట్టకు వచ్చి వ్రతం చేయించుకున్నారు. అనంతరం ఈ నెల 17న ఆమె స్నేహితురాలితో కలిసి నవ జంట వరుడి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి హైదరాబాద్‌లో షాపింగ్ చేశారు. వధువు కోసం మూడు తులాల గోల్డ్ చైన్‌తోపాటు రూ.40 వేల దుస్తులు కొనుగోలు చేసి రాత్రి సమయానికి ఇంటికి చేరుకున్నారు.

అత్తారింటిలో అడుగు పెట్టిన పెళ్లి కూతురు ఇళ్లంతా పరిశీలించింది. తన బట్టలను బీరువా సర్ధుతానని వెళ్లి అందులో ఉన్న రూ.2 లక్షల నగదును కొట్టేసింది. దాంతోపాటు గోల్డ్ చైన్, ఇతర విలువైన వస్తువులను బ్యాగ్‌లో సర్ధుకుంది. అంతా ఓకే అయ్యాక వధువు స్నేహితురాలు తాను హైదరాబాద్ వెళ్తానని క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ వచ్చే సమయానికి.. తనకు తల నొప్పిగా ఉన్నదని, టాబ్లెట్ కావాలని కోరడంతో వరుడు మెడికల్ షాప్‌కు వెళ్లాడు. అదే అదునుగా భావించిన ఆ ఇద్దరు కిలాడీ లేడీలు క్యాబ్‌లో పరారీ అయ్యారు. హైవే మీదికి రాగానే క్యాబ్‌డ్రైవర్‌ను బెదిరించి కారులోనే దుస్తులు మార్చుకున్నారు. ఎల్‌బీ నగర్‌లో దిగి విజయవాడ వైపు పారిపోయారు.

మెడికల్ షాప్ నుంచి ఇంటికి వచ్చిన వరుడికి భార్య కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. ఇంట్లో పరిశీలించగా.. నగలు, నగదు, ఇతర విలువైన వస్తువులు కనిపించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన వరుడు.. పెళ్లిలా బ్రోకర్‌ను నిలదీస్తే తనకు తెలియదని తప్పించుకున్నాడు. ఇప్పటి వరకు ఈ ఘటనపై వరుడు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు.

Advertisement

Next Story