చేనేత చీరల్లో.. తళుక్కుమన్న తారలు

by Anukaran |   ( Updated:2020-08-07 03:54:13.0  )
చేనేత చీరల్లో.. తళుక్కుమన్న తారలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత స్వాతంత్య్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం వచ్చింది. మొదటిసారిగా 1905లో బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని టౌన్‌హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించడంతోపాటూ దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అలా విదేశీ వస్తు బహిష్కరణలో కీలకపాత్ర వహించిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఈ సంద‌ర్భంగా ప‌లువురు సెల‌బ్రిటీలు శుక్రవారం నేత చీరలు ధ‌రించిన ఫొటోలు షేర్ చేస్తూ..చేనేత ప‌రిశ్ర‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నారు.

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించి… గ్లోబల్ స్టార్ ఎదిగింది ప్రియాంక్ చోప్రా. ఈ బ్యూటీ ప‌లు సంద‌ర్భాల‌లో చీర ధ‌రించిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీగా షేర్ చేస్తూ.. ‘భారతీయ చేనేత వ‌స్త్రాలు ప్ర‌త్యేక‌మైన‌వి. హ‌స్త‌క‌ళ ఎంతో గొప్ప‌ది. చేనేత‌ల‌కు, చేనేత వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌కు మ‌న మ‌ద్ద‌తు ఇద్దాం’ అని ప్రియాంక త‌న పోస్ట్‌లో పేర్కొంది.

‘చేనేతను ప్రమోట్ చేద్దాం. చేనేత మన దేశం గర్వించే ఉత్పత్తి. ఎంతోమంది చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్నారు. మీరు చేనేతను ఎంచుకుంటే.. వారికి సాయం చేసిన వారవుతారు. మాతృభూమి ఉత్పత్తులను ఎంపిక చేసుకోండి. ఈ భూమ్మీద ఉన్న ప్రతి దాన్ని ప్రేమించండి’ అంటూ కంగనా రనౌత్ పోస్ట్ చేస్తూ.. తన నూలు వడుకుతున్న ఫొటోను షేర్ చేసింది.

శ్రీదేవి గారాల ప‌ట్టి జాన్వీ క‌పూర్ కూడా తాను చీర ధ‌రించిన ఫొటోను షేర్ చేస్తూ.. “ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం! ఇది నాకు చాలా ఇష్టమైన, ప్రత్యేకమైన చేనేత చీర. మన దేశంలో చేనేత, చేతివృత్తుల వారి నైపుణ్యం, సృజనాత్మకత చాలా గొప్పది , ప్రపంచంలోనే అత్యుత్తమమైంది’ అంటూ పోస్ట్ పెట్టింది.

చేనేత రంగంలో మహిళ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్న ఆసు పనికి..యాంత్రిక సహాయం అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో చింతకింది మల్లేశం అనే చేనేత కళాకారుడు ఆసు యంత్రాన్ని రూపొందిస్తాడు. ఈ కామన్ మ్యాన్ కథగా వచ్చిన చిత్రం ‘మల్లేశం’.ఇందులో మల్లేశం తల్లిపాత్రలో యాంకర్ ఝాన్సీ అద్భుతంగా నటించి మెప్పించింది. ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా.. ‘లూమ్ స్టోరీస్’కు సంబంధించిన వీడియోను షేర్ చేసుకుంది. ఇక్కత్ ఆర్ట్‌కు అంకితం అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed