Humanitarian police: ఆకలితో తనువు చాలించిన వృద్ధురాలు… మానవత్వం చాటిన పోలీసులు

by Anukaran |   ( Updated:2023-05-19 10:39:12.0  )
Humanitarian police: ఆకలితో తనువు చాలించిన వృద్ధురాలు… మానవత్వం చాటిన పోలీసులు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నా అన్న వారు ఎవరూ లేక.. ఆకలికి అలమటించి చివరికి తనువు చాలించింది ఓ వృద్ధురాలు.. ఆమె శవానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కరోనా భయంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో మేమున్నామంటూ పోలీసులు ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా మదనపూర్ మండల కేంద్రానికి చెందిన శకుంతలమ్మ(85) అనే వృద్ధురాలు ఒంటరిగా గ్రామంలో ఒక చిన్న గుడిసెలో నివాసం ఉంటుంది. నెల రోజుల క్రితం కింద పడడంతో కాలు విరిగింది. ఆమెకు చుట్టుపక్కల జనాలు మూడు పూటల భోజనం పెట్టేవారు. ఈ మధ్యకాలంలో శకుంతలమ్మ నివాసం ఉంటున్న గుడిసె పక్కన ఇండ్లలో వారికి కరోనా సోకడం, అందులో ఒకరు మరణించడంతో జనం భయపడి అటువైపు వెళ్లడం మానేశారు.

దీంతో ఆకలిదప్పులతో శకుంతల అలమటిస్తున్నా చూసే వారు లేక శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచింది. విషయం తెలిసినా ఆ వృద్ధురాలు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరు ముందుకు రాలేదు. సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న ఎస్సై తిరుపాజి అక్కడికి వెళ్లి ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఎస్సై తమ సిబ్బంది రవి, కురుమయ్య గౌడ్, శివారెడ్డి, స్వాములు, రాజశేఖర్, అబ్దుల్ కలాం తదితరులను పిలిపించి అంత్యక్రియలను మనమే చేద్దామని చెప్పడంతో అంగీకరించారు. పోలీసులే అంతిమయాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేసి శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. విషయం క్షణాలలోనే సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అవడంతో పోలీసుల చర్యలకు అభినందనలు తెలుపుతున్నారు.

Advertisement

Next Story