నత్తనడకన ప్రాజెక్టులు.. సాగు, తాగు క‘నీటి’ కష్టాలు!

by Shyam |   ( Updated:2021-02-09 12:00:49.0  )
నత్తనడకన ప్రాజెక్టులు.. సాగు, తాగు క‘నీటి’ కష్టాలు!
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : పాలకులు మారినా ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగు నీటి గోస మాత్రం తీరడం లేదు. తలాపునే కృష్ణమ్మ ఉన్నా తాగేందుకు గుక్కెడు మంచినీరు లేక జనం తల్లడిల్లుతున్నరు. ఫ్లోరైడ్ రక్కిసి బారిన పడి ప్రాణాలొదులుతున్నా పట్టింపులేదు. పెండింగ్ లో ఉన్న ఎస్ఎల్‌బీసీ, డిండి, ఉదయ సముద్రం వంటి పథకాలకు అతీగతీ లేదు. సీఎం కేసీఆర్ వీటిని పక్కనబెట్టి, కొత్త ప్రాజెక్టులను ఎత్తుకోవడం విమర్శలకు దారితీస్తోంది. పాత ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం వెనుక ఆంతర్యమేమిటన్నది అంతుబట్టడం లేదు. సాగునీటి కోసం ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్నారా? లేక కాంట్రాక్టర్ల కోసమా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాది కీలక పాత్ర. గోదావరి నదీ జలాల కంటే, కృష్ణానది జలాల విషయంలోనే ఏపీ, తెలంగాణల మధ్య ప్రధాన వివాదం నడిచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ జిల్లాపై శీతకన్ను పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం హాలియాలో పర్యటించనున్నారు.

ఇదీ డిండి గోస

కరువు, ఫ్లోరైడ్ ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించేందుకు విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు బీజం పడింది. ఇందులో భాగంగా చింతపల్లి, కిష్టరాయినిపల్లి, చర్లగూడెం, గొట్టిముక్కల, సింగరాజుపల్లి జలాశయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.6,190 కోట్లతో 2015 జూన్ 12వ తేదీన మర్రిగూడ మండలం చర్లగూడెంలో సీఎం కేసీఆర్ వీటికి శంకుస్థాపన చేశారు. 3.11 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావాలనేది లక్ష్యం. ఐదేండ్లు గడిచినా ఆ ప్రాజెక్టు మూడు అడుగులు ముందుకి.. ఐదడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. చింతపల్లి జలాశయం కోసం 1691 ఎకరాలు భూమి సేకరించాలి. 573 ఎకరాల భూమిని మాత్రమే సేకరించారు. కిష్టరాయినిపల్లి జలాశయానికి 2043.39 ఎకరాలు భూమి సేకరించాలి. 1847 ఎకరాలే సేకరించారు. చర్లగూడెం జలాశయానికి 3314.36 ఎకరాలు అవసరం కాగా, 2300 ఎకరాలు సేకరించారు. గొట్టిముక్కల జలాశయానికి 1877 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, 1550 ఎకరాలు సేకరించారు. సింగరాజుపల్లి జలాశయానికి 699.21 ఎకరాలు అవసరం కాగా, 684.15 ఎకరాలు సేకరించారు.

బ్రహ్మణ వెల్లెంల భ్రమేనా?

నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాలలో 1.27 లక్షల ఎకరాలకు సాగు నీరు, 107 గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని 2007 సంవత్సరంలో చేపట్టారు. రూ.699 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించినా డీపీఆర్‌లో మార్పుల కారణంగా రూ.483.94 కోట్లకు అంచనా వ్యయం తగ్గింది. 0.305 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించడంతో పాటు ఎడమ, కుడి కాల్వల ద్వారా నీరందించాలనేది లక్ష్యం. భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. 3864 ఎకరాలు అవసరం కాగా, 1379 ఎకరాలు మాత్రమే సేకరించారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని మళ్లించేందుకు అవసరమైన 1335 ఎకరాల్లో 299 ఎకరాల సేకరణ పూర్తయ్యింది. 91.70 మీటర్ల లోతులో ఉన్న సర్జ్‌పూల్‌లోని నీటిని ఎత్తిపోసేందుకు రెండు మోటార్లు ఏర్పాటు చేశారు. పంప్‌హౌజ్‌లో కంట్రోల్ ప్యానెల్‌ను రెడీ చేసినా డ్రైరన్ చేపట్టలేదు. ప్రాజెక్టు అంచనా వ్యయం కంటే, రూ.250 కోట్లకు పైగా నిధుల అవసరం ఉంది. వీటిని విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది.

15 ఏండ్లుగా సాగుతున్న SLBC

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) పనులను 2005లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించారు. 2010 నాటికి పనులను పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3.5 లక్షల ఎకరాలకు సాగు నీరు, 250 గ్రామాలు పైగా తాగునీరు అందించాలనుకున్నారు. ప్రాజెక్టు రూ.1925 కోట్ల అంచనాతో ప్రారంభమైతే, తర్వాత అది రూ.3,152.72 కోట్లు, అనంతరం రూ.4200 కోట్ల అంచనాకు చేరింది. 2020 అక్టోబరుకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. 43.930 కిలోమీటర్ల పొడవున సొరంగం తవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 33 కిలోమీటర్లకు పైగా తవ్వారు. ఇంకా పది కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. తరచూ పనులు నిలిచిపోతున్నాయి. నాలుగు సార్లు గడువు ముగిసిపోయింది. పనులను టన్నెల-1, టన్నెల్-2గా విభజించారు. టన్నెల్-1 మొత్తం 43 కిలోమీటర్లు కాగా, టన్నెల్-2 పొడువు 7.25 కిలోమీటర్లు. టన్నెల్-2 పనులు పూర్తయ్యాయి. లైనింగ్ పనులు 40 శాతం లైనింగ్ పనులు పూర్తయ్యాయి.మిగిలినవి టన్నెల-1కు సంబంధించిన పనులే కావడం గమనార్హం. టన్నెల్-1 పనులను రెండు వైపులా నుంచి చేస్తున్నారు. ఇందులో ఇన్ లెట్ నుంచి 14 కిలోమీటర్లు, ఔట్ లెట్ నుంచి 19 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ నెల రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తే అరకిలోమీటరు (500మీటర్లు) మాత్రమే తవ్వగలుగుతుంది. ఈ లెక్కన మిగిలిన 10 కిలోమీటర్లు తవ్వేందుకు ఎటూ లేదన్న రెండేండ్లకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed