వినియోగదారుడిపై గ్యాస్ సిలిండర్ ధరల భారం!

by Harish |   ( Updated:2020-12-15 08:31:37.0  )
వినియోగదారుడిపై గ్యాస్ సిలిండర్ ధరల భారం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు సామాన్యుల ఇండ్లల్లో మంట రాజేస్తుంటే..ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పక్షం రోజుల్లో రెండు సార్లు ధరలను పెంచేసి గ్యాస్ వినియోగ దారులను చమురు కంపెనీలు భయపెడుతున్నాయి. అన్ని రకాల నిత్యావసరాలు ధరలు పెరుగుతున్న సమయంలో ఎల్‌పీజీ గ్యాస్‌ను మరోసారి పెంచాయి. ఈ నెల మొదట్లో రూ. 50 వరకు పెంచిన చమురు కంపెనీలు మంగళవారం మరోసారి రూ. 50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్ ఉత్తర్వు లిచ్చింది.

దీంతో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.50 పెరగ్గా, 5 కిలోల చిన్న సిలిండర్ ధర రూ. 18, 19 కిలో సిలిండర్ ధర రూ. 36.50 పెరిగింది. ఈ ధరల పెరుగుదలతో కేవలం 15 రోజుల్లో ఎల్‌పీజీ గ్యాస్ ధర రూ. 100 పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం..నాన్-సబ్సీడీ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ. 694 ఉండగా, ముంబైలో రూ. 694, కోల్‌కతాలో రూ. 720.50, హైదరాబాద్‌లో 696.50, విజయవాడలో రూ. 854, చెన్నైలో రూ. 660కి ఎగిశాయి. సాధారణంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి నెలా మొదటి రోజున ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి.

కానీ, ఈసారి 15 రోజుల వ్యవధిలో ధరలను రెండోసారి పెంచేశాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కూడా రూ. 54.50 పెరిగింది. ఏడాదిలో 12 సిలిండర్లను సబ్సీడీ రూపంలో ప్రభుత్వం అందిస్తోంది. కొనే సమయంలో పూర్తిగా మార్కెట్ ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతరం సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం గ్యాస్ వినియోగదారుడు అనుసంధానం చేసిన బ్యాంకు అకౌంట్‌లోకి జమ చేస్తుంది. ఏడాదిలో 12 సిలిండర్లకు మించి వినియోగిస్తే మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా అంతర్జాతీయ ఎల్‌పీజీ ధరల్లో మార్పులను విదేశీ మారకపు రేటు ఆధారంగా సవరిస్తారు.

Advertisement

Next Story