బయ్యారంలో అక్రమ కట్టడాలు.. అధికారులకు భారీ ముడుపులు..!

by Sridhar Babu |   ( Updated:2021-09-14 04:26:36.0  )
బయ్యారంలో అక్రమ కట్టడాలు.. అధికారులకు భారీ ముడుపులు..!
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బయ్యారం క్రాస్ రోడ్డుకు ఇరువైపులా బహుళ అంతస్థుల అక్రమ కట్టడాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. పినపాక మండలంలో ఉండే సంబంధిత అధికారుల కళ్ళముందే జోరుగా అక్రమ కట్టడాలు జరుగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని గిరిజనులు వాపోతున్నారు.

అధికారులు అక్రమ కట్టడాల నిర్మాణాలను పరిశీలించి నోటీసులు ఇవ్వాల్సిందిపోయి బయ్యారం అగ్రకులాల పెత్తందారులకు, బడబాబులకు అమ్ముడుపోయారని గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పినపాక మండలంలో ఉండే అగ్రకులాల పెత్తందారులు, బడాబాబులు పినపాక మండల వ్యాప్తంగా నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ కట్టడాలు యథేచ్ఛగా చేస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అగ్రకులాల పెత్తందారులు, బడాబాబులు అమాయకమైన గిరిజనులను బెదిరించి, బినామీలుగా చేసుకొని భూములను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు.

నియోజకవర్గంలో ఉండే సంబంధిత అధికారులు, అగ్రకులాల పెత్తందారులు, బడాబాబులు ఇచ్చే ముడుపులకు కక్కుర్తిపడి వారి కళ్ళముందే బహుళ అంతస్తుల కట్టడాలు జరుగుతున్నా చర్యలు చేపట్టడంలేదని గిరిజనులు వాపోతున్నారు. స్థానిక ఏరియా సర్పంచ్ నుంచి జిల్లా అధికారుల వరకు అక్రమ కట్టడాలలో భారీగా ముడుపులు అందాయని గిరిజనులు ఆరోపిస్తున్నారు. గిరిజనులు ఉండటానికి జానేడు భూమి, సరైన పూరి గుడిసె లేదు.. కానీ, అగ్రకులాల పెత్తందారులకి, బడాబాబులకి బహుళ అంతస్తులను కట్టడానికి ఎలా సాధ్యపడుతుందని గిరిజనులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అంటే, దీన్ని బట్టి అధికారులు, అగ్రకులాల పెత్తందారులకి, బడాబాబులకి ఎంతలా అమ్ముడుపోయారో అక్రమ కట్టడాల ద్వారా తేటతెల్లమౌవుతోంది.

బహుళ అంతస్తులకు సంబంధించిన జిల్లా అధికారి(డి.ఎల్.పి)పవన్‌తో ‘దిశ’ విలేకరి ఫోన్‌లో వివరణ కోరగా అక్రమ కట్టడాలను కూల్చివేసి, నోటీసులు పంపిస్తామని తెలిపారు. కానీ, ఇంతవరకు జిల్లా అధికారి(డి.పి.ల్)పవన్ వచ్చి అక్రమ కట్టడాలను చూసిన పాపన పోలేదు. ఈ నేపథ్యంలో విలేకరి మరోసారి ఫోన్ చేస్తే ఇదిగో వస్తున్నా.. అదిగో వస్తున్నా అని మాటల గారడీ చేశారు. మరి జిల్లా అధికారి పవన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.? ఎందుకు బహుళ అంతస్తులపై చర్యలు చేపట్టడంలేదనే విషయం మండలంలో సంచలనాత్మకంగా మారింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్.. సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు చేపట్టి, ఏజెన్సీ ప్రాంతంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల కట్టడాలను కూల్చివేయాలని గిరిజనులు, గిరిజన సంఘాలు, పలువురు ప్రముఖులు కోరుతున్నారు. ఈ కట్టడాలపై జిల్లా కలెక్టర్.. అధికారులపై చర్యలు చేపడతారా..లేక మద్దతు తెలుపుతారా.? అనేది వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed