- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలగా మినీ ట్యాంక్‌బండ్.. మందు పార్టీలకు అడ్డగా మారిన వైనం
దిశ , నర్సంపేట : నియోజక వర్గ ప్రజలకు మినీ ట్యాంక్ బండ్ కోరిక తీరని కలగానే మిగిలిపోతోంది. నిధులు మంజూరై దాదాపు ఆరేండ్లు కావస్తోన్నా ఆ వైపుగా చర్యలు సాగడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలోనే అతి పెద్ద పైలాన్ని ఆర్భాటంగా ఆవిష్కరించారు. కొన్ని నెలల్లోనే మాదన్న పేట పెద్ద చెరువుపై మినీ ట్యాంక్ బండ్ కొలువుదీరనుందని ఆశించిన జనాలకు మొండి చెయ్యి చూపారు. నేటికీ మాదన్న పేట పెద్ద చెరువు అభివృద్ధికి నోచుకోలేదు. స్వరాష్ట్రంలో అయిన మినీ ట్యాంక్ బండ్ వస్తుందని కలగన్న నియోజక వర్గ ప్రజల కల కలగానే మిగిలిపోయింది.
ఇదీ నేపథ్యం…
కాకతీయుల పరిపాలనా కాలంలో అక్కన్న, మాదన్న అనే సామంత రాజులు మాదన్న పేరిట పెద్దచేరువును నిర్మించారు. ఈ సరస్సు ఆయకట్టు కింద 2400 ఎకరాల వరి పంట సాగవుతోంది. ప్రతీయేడు వర్షాకాలంలో జలకలతో నియోజక వర్గ ప్రజల్ని కనువిందు చేస్తుంది. మత్తడి పొసే సమయంలో మాదన్న పేట పెద్దచెరువుకు పర్యాటకుల తాకిడి పెరుగుతూ వస్తోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2015లో అప్పటి నీటిపారుదల శాఖా మంత్రి టీ. హరీష్ రావు రాష్ట్రంలోనే భారీ పైలాన్ ని మాదన్న పేట కట్టపై ఆర్భాటంగా ఆవిష్కరించారు.
మాదన్న పేట పెద్దచెరువును పర్యాటక ప్రాంతంగా, కట్టని మినీ ట్యాంక్ బండ్గా మారుస్తామని నేతలు హామీనిచ్చారు. మిషన్ కాకతీయ పథకంలో ఈ మాదన్న పేట పెద్ద చెరువును చేరుస్తూ రూ. 7.50 కోట్లను మంజూరు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పటి సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి సైతం మినీ ట్యాంక్ బండ్ కల నెరవేర్చి తీరుతామని ప్రకటించారు. అయినప్పటికీ అభివృద్ధి దిశగా అడుగులు పడలేదు. ఇంతటి ప్రాశస్యం కలిగిన మాదన్నపేట పెద్ద చెరువు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. నేతలు ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయి.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం…
మిషన్ కాకతీయ పథకంలో చేర్చిన మాదన్నపేట పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణలో భాగంగా రూ7.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. శ్రీ మాతా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ పనులు దక్కించుకుంది. చెరువు పునరుద్ధరణ పనుల్లో నాణ్యత లోపించడంతో కట్టపై ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు కోతకు గురవుతోంది. కమలాపురం గ్రామ శివారు నుండి మాదన్నపేట శివారు వరకు రోడ్డు పనులు తూతూ మాత్రంగా చేయడంతో దాదాపుగా కట్ట పొడవునా పగుళ్లు ఏర్పడి గండ్లు పడుతున్నాయి. పెద్ద చెరువులో లక్ష క్యూబిక్ మీటర్ల పూడిక మట్టి తీయాల్సి ఉండగా.. అందులో ఒక భాగం కూడా తీయలేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. 16.10 అడుగుల నీటి మట్టం సామర్థ్యం కలిగిన మాదన్నపేట పెద్ద చెరువు తూముకు ఏర్పాటు చేసిన షట్టర్ రెండేళ్ళకే శిథిలమైపోయింది. నాసిరకం పరికరాల వాడకంతో తూముపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారుల పనితనంతో కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ కి అప్పనంగా అప్పజెప్పారన్న ఆరోపణలు వస్తున్నాయి.
మురిపించిన బోటు షికారు…
పర్యాటక కేంద్రంగా మాదన్న పేట పెద్ద చెరువును అభివృద్ధి చేస్తామన్న అధికారులు, ప్రజాప్రతినిధులు బోటును ఏర్పాటు చేశారు. రెండు, మూడు రోజులు సరదాగా షికారు చేశారు. అనంతరం ఇక్కడ నుండి ఆ బోటుని వేరే చోటుకి తరలించారు. చెరువు కట్టపై కాటేజీల నిర్మాణం పేపర్ లోనే జరిగింది. వాస్తవ రూపం నేటికీ దాల్చలేదు.
అసాంఘిక కార్యాలపాలకు అడ్డా…
పర్యాటకులతో విరాజిల్లాల్సిన మాదన్న పేట పెద్దచెరువు ప్రాంతం నేడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోంది. విచ్చలవిడిగా బహిరంగంగా మద్యం సేవించడానికి అడ్డాగా మారింది. వనభోజనాలకు ఈ చేరువుకట్టపైకి వచ్చే వారికి కట్ట పోడవునా మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. చెరువు కట్ట ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో పార్టీలు, విందులకు అడ్రస్ గా మారింది.
ప్రమాదంలో ఆలయం…
మాదన్నపేట పెద్ద చెరువు కట్టపై కొత్తగా ఆలయం నిర్మించారు. చెరువు పునరుద్ధరణలో భాగంగా ఏర్పాటు చేసిన రోడ్డు నిర్మాణపనుల్లో నాణ్యత లోపించింది. ఈ కారణంగా ఆలయం నిర్మించిన ప్రాంతంలో భూమి కోతకు గురవుతోంది. కొద్దికొద్దిగా క్రమక్షయానికి గురవుతోన్న మట్టి రోడ్డు మూలంగా ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ట్యాంక్ బండ్ నిర్మాణం చేపట్టాలి…
ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన మాదన్న పేట పెద్ద చెరువుపై మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బోటు, కాటేజీల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి సైతం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పునరుద్ధరణ పనులు మొదలు పెట్టాలని నియోజక వర్గ ప్రజలు కోరుతున్నారు.