వికారాబాద్‌లో అధికారుల వేట.. ఎందుకోసం?

by Anukaran |
వికారాబాద్‌లో అధికారుల వేట.. ఎందుకోసం?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: పట్టణాలకే పరిమితమైన ప్రకృతి వనాలు పల్లెలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రకృతి వనాలు (పార్క్) ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రకృతి వనాలు (పార్కు) ఏర్పాటుకు అధికారులను ఆదేశించింది. వాస్తవానికి ఈనెల 3వ తేదీ వరకు స్థలాలు గుర్తించి మొక్కలు నాటాలని సూచించినప్పటికీ పలు గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో జాప్యం జరుగుతోంది.

అయితే ఈ నెలాఖరు వరకు స్థలాలు సేకరించి, మొక్కలు నాటాలని జిల్లా పంచాయతీ, రెవెన్యూ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాలో 560 గ్రామ పంచాయతీలకు గాను 493 గ్రామా పంచాయతీల్లో స్థలాలను గుర్తించి, మొక్కలు నాటారు. ఇంకా 67 గ్రామాల్లో స్థలాలు వివాదంలో ఉన్నాయి. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో 566 గ్రామ పంచాయతీల్లో 342 గ్రామ పంచాయతీ పరిధిలోనే స్థలాలను గుర్తించగా 224 గ్రామాల్లో స్థలాలు కరువైనట్లు జిల్లా పంచాయతీ అధికారి స్పష్టం చేశారు.

వికారాబాద్ జిల్లాలో…

కొడంగల్ మండలంలో 26 గ్రామాలున్నాయి. ఇందులో కేవలం 15 గ్రామాల్లోనే స్థలాలను గుర్తించారు. మిగిలిన 11 గ్రామాల్లో స్థలాలు గుర్తించేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అదేవిధంగా బోంరాస్పేట్ మండలంలో 25 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 10 గ్రామాల్లో ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు. దౌల్తాబాద్ మండలంలో26 గ్రామాల్లో 13 గ్రామాల్లోనే స్థలాలు సేకరించి, మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈవిధంగా జిల్లాలోని 17 మండలాల్లోని గ్రామాల్లో మెజార్టీ గ్రామ పంచాయతీల్లో స్థలాలు దొరక్కపోవడం, స్థలం ఉంటే వివాదంలో ఉండటం కనిపిస్తోందన్నారు. రెవెన్యూ శాఖాధికారులు పంచాయతీలకు అప్పగించే వరకు వేచి చూడాల్సి వస్తోందని పంచాయతీ అధికారులు స్పష్టం చేశారు.

ఉపాధి హామీలో భాగంగానే..

హరితహారం కార్యక్రమం విజయవంతంలో భాగంగా ప్రకృతి వనాలను ఉపాధి హామీతో అనుసంధానం చేస్తూ పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు చేశారు. ప్రతి గ్రామంలో సుమారుగా 20 గుంటల భూమి నుంచి ఎకరం స్థలంలో ప్రకృతి వనాలను వృద్ధి చేయాలి. అయితే 20 గుంటల భూమిలో 2 వేల మొక్కలు, 30 గుంటల భూమిలో 3వేల మొక్కలు, ఎకరం స్థలంలో 4వేల మొక్కలు నాటి సంరక్షించాలని ప్రభుత్వం సూచించింది. మూడు రకాలుగా విభజించి 43 రకాల మొక్కలను నాటనున్నారు.

Advertisement

Next Story