అవినీతికి పనిష్మెంట్ ప్రమోషన్.. జీహెచ్ఎంసీ బాసుల నిర్వాకం

by Sumithra |
GHMC
X

దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతికి పాల్పడాడు.. శిక్షించమని రిపోర్ట్ ఇస్తే.. ప్రమోషన్ ఇచ్చి సత్కరించారు. ఈ వింత మన గ్రేట్.. గ్రేట్ జీహెచ్ఎంసీలో చోటుచేసుకుంది. ఏ శాఖలోనైనా అవినీతి ఆరోపణలు వస్తే.. సదురు అధికారులను విధుల నుంచి తొలగిస్తారు. లేదా వేరే స్థానంలోకి బదిలీ చేస్తారు. లేదంటే కనీసం షోకాజ్ నోటీసులు జారీ చేసి, అవినీతి సొమ్ము జప్తు చేస్తారు. కానీ జీహెచ్ఎంసీ బాసులు అలా చేయలేదు. అందలం ఎక్కించి కూర్చోబెట్టారు. ప్రజలు బల్దియా వ్యవహారాలను ఎంత ఛీదరించుకున్నా.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్టే ఉంటాయి. ఇందుకు తాజాగా శేరిలింగంపల్లి జోన్‌లోని ఓ ఉన్నతాధికారి విషయంలో జరిగిన ఉదాంతమే ఉదాహరణ.

శేరిలింగంపల్లి జోన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఓ అధికారి ట్రాక్ రికార్డంతా అవినీతిమయమే. ఇవి ఆరోపణలు కాదు. స్వయంగా.. అధికారుల అవినీతిని బట్టబయలు చేసే విజిలెన్స్ స్పష్టం చేసిన విషయమే. ఒక్కసారి కాదు.. సదరు అధికారి సర్వీసులో రెండుసార్లు విజిలెన్స్ దాడులను ఎదుర్కొని.. సాక్ష్యాధారాలతో సహా పట్టుబడ్డాడు. రూరల్ ఏరియాల్లో పని చేస్తున్నప్పుడు విజిలెన్స్‌కు చిక్కిన సదరు అధికారి జీహెచ్ఎంసీలో పాగా వేశారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో సిటీ ప్లానర్ పోస్టుతో పాటు రెండు అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాధ్యతలు నిర్వహించిన సదరు అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న నిర్మాణాలను చట్ట పరిధిలోకి ఎలా తీసుకురావాలో దగ్గరుండి మరీ సదరు సీపీ చక్కబెట్టేవారు.

అక్రమానికి ప్లాన్..

అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే క్రమంలో పక్కన ఉన్న ఇతర ఇళ్ల యజమానులతో డీల్ మాట్లాడి మరీ డబ్బులు వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. జోన్ పరిధిలో సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన ఓ ఇంటికి నిబంధనల ప్రకారం అనుమతి లభించలేదు. దీన్ని చక్కదిద్దేందుకు బేరం కుదుర్చుకున్న సదరు అధికారి పక్కన ఉన్న యజమానితో మాట్లాడి వారి స్థలంలోకి వచ్చేలా కొత్త భవనం ప్రహరీ నిర్మించారు. సెట్‌బ్యాక్ ఉండటంతో మూడంతస్తుల భవనానికి అనుమతినిస్తూ జీహెచ్ఎంసీ నుంచి ఆక్యూపై సర్టిఫికెట్(ఓసీ) జారీ చేశారు. ఆ తర్వాత అనుమతికి మించి అంతస్తులను నిర్మించారు. ఈ వ్యవహారమంతా సదరు అధికారి కనుసన్నల్లో నడిచిందనేది బహిరంగ రహస్యం.

చర్యలు తీసుకోమంటే..

విజిలెన్స్ చేపట్టిన దర్యాప్తులో సదురు అధికారి ఆరు భవనాలకు సంబంధించిన అనుమతుల్లో అవినీతికి పాల్పడటం వాస్తవేమనని తేలింది. దీంతో ఆధారాలతో సహా రిపోర్టు తయారు చేసి అధికారిపై చర్యలకు జీహెచ్ఎంసీ సిఫార్సు చేస్తూ రిపోర్టును అందించి విజిలెన్స్ తప్పుకుంది. అయితే సిటీ ప్లానర్‌పై చర్యలు తీసుకోవాల్సిన జీహెచ్ఎంసీ స్పందించలేదు. శిక్షించడం పక్కన ఉంచితే.. ఆయనకు ప్రమోషన్ ఇచ్చి మరీ అభినందించింది. విజిలెన్స్ రిపోర్టును చెత్త బుట్టలో వేసిన జీహెచ్ఎంసీ తాజాగా జాయింట్ డైరెక్టర్ హోదాను కట్టబెట్టింది. జీహెచ్ఎంసీలోని అన్ని జోన్లలోనూ అవినీతి రుజువైన అధికారులకు ప్రమోషన్లు ఇస్తుండటం ఆనవాయితీగా మారింది. ప్రభుత్వ శాఖలు అవినీతి అధికారులను శిక్షించేందుకు సిఫార్సు చేస్తుంటే.. బల్దియా మాత్రం వారికి ప్రమోషన్లు, కొత్త బాధ్యతలను అప్పగిస్తూ అందలం ఎక్కిస్తుండటం గమనార్హం. ఈ వ్యవహార శైలిపై ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ విభాగంలో మార్పు రావడం లేదు.

Advertisement

Next Story