అధికారుల ఆత్మహత్యలు.. ఆంతర్యం ఇదేనా?

by Sumithra |   ( Updated:2020-10-14 22:40:54.0  )
అధికారుల ఆత్మహత్యలు.. ఆంతర్యం ఇదేనా?
X

రాష్ట్రంలో రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందా? ప్రభుత్వంలోని ఏ శాఖలో లేని ఒత్తిడి వీళ్లకు మాత్రమే ఎందుకు ఉంటోంది? ఏసీబీకి పట్టుబడుతున్న అవినీతి కేసుల్లో దాగుంటున్న అసలు నిజాలేంటి? రెవెన్యూ శాఖలో ఇంకెంత మంది అధికారులు బలి కావాల్సి ఉంది? ఇంతకీ వారు బలవుతున్నారా..? బలి చేస్తున్నారా..? మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యతో ఇలాంటి సందేహాలెన్నో కలుగుతున్నాయి..

దిశ, క్రైంబ్యూరో :

అధికారులు అవినీతి కేసులో చిక్కడం అనేది కొందరు స్వయంగా చేసుకుంటే.. మరికొందరు ఉన్నతాధికారుల కోసం బలి కావాల్సి వస్తోంది.. అయితే, గతంలో లంచాలు కేవలం వేల రూపాయలకు మాత్రమే పరిమితం అయ్యేవి. కానీ, ఈ మధ్య కాలంలో లక్షలు, కోట్లు దాటుతున్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు వారు చేసే అవినీతిలో తీసుకుంటున్న లక్షలు, కోట్ల రూపాయల లంచాలు అసలు వాళ్ల కోసం తీసుకుంటున్నారా.. ఇంకెవరి కోసమైనా తీసుకోవాల్సి వస్తోందా.. అనే అంశంపై సవాలక్షల సందేహాలు కలుగుతున్నాయి. ఈ సందేహాలలో ఉన్నతాధికారులతో పాటు రాజకీయ కారణాలు కూడా చర్చకు వస్తున్నాయి. అందువల్లనే లంచాలను భారీ స్థాయిలో డిమాండ్​ చేస్తున్నట్టు తెలుస్తోంది.

దీంతో లంచాలు తీసుకుంటున్న వారు మాత్రమే బలి అవుతూ.. ఆపై తెరవెనుక ఉండి నడిపించే కథానాయకులు మాత్రం అవినీతి మరకలు అంటకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనేక ఏళ్ల పాటు ప్రభుత్వ సర్వీసులో సేవలు అందిస్తున్న అధికారులు అవినీతి కేసులో ఇరుక్కోవడం, ఆ తర్వాత విచారణలో అనేక ఒత్తిడులకు లోనవుతూ తనువు చాలించుకుంటున్నట్టుగా పలువురు భావిస్తున్నారు.

నాగరాజు ఆత్మహత్యపై అనుమానాలు..

ఏసీబీకి చిక్కిన కీసర మాజీ తహసీల్దార్ బుధవారం తెల్లవారు జామున చంచల్గూడ జైలులో ఆత్మహత్య సంఘటన అందర్నీ కలిచివేచింది. ఓ భూ వివాదంలో తహసీల్దార్ నాగరాజు రియల్టర్ల నుంచి రూ.1.10 కోట్లను లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్​గా పట్టుబడిన సంగతి తెల్సిందే. అందుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఒక కేసు కొనసాగుతుండగానే ఏసీబీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. అవినీతికి సంబంధించిన అంశాన్ని సమర్థించడానికి ఎలాంటి ఆస్కారం లేకున్నా.. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే ఆ లంచం తీసుకోవడానికి అంగీకరించినట్టుగా ఏసీబీకి కస్టడీ విచారణలో నాగరాజు చెప్పినట్టుగా విశ్వాసనీయ సమాచారం.

ఈ విషయంపై మీడియాలో కూడా పలు కథనాలు వచ్చాయి. కానీ, ఏసీబీ విచారణ ఆ వైపుగా ఎందుకు కొనసాగలేదనే విషయమే ఇక్కడ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే, నాగరాజు చెబుతున్న ఉన్నతాధికారుల్లో ఒకరు ప్రభుత్వంలోని ఓ బలమైన సామాజికవర్గానికి చెందిన వాడు కాగా, మరొకరు బలమైన నేతకు సమీప పరిచయస్తుడు కావడం కారణంగానే ఆ వైపుగా విచారణ కొనసాగడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం నాగరాజు ఆత్మహత్యను కుటుంబ సభ్యులు సైతం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్​ చేస్తున్నారు. జైలులో ఖైదీలు అసలేమాత్రం ఆత్మహత్యకు పాల్పడటానికి అవకాశం లేకుండా జైలు అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకునే విషయం తెల్సిందే. కానీ, నాగరాజు టవల్ తో కిటికీకి ఉరివేసుకోవడం పట్ల ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

ఒత్తిడికి చిత్తవుతున్న అధికారులు..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై చోటు చేసుకున్న హత్య ఆమె స్వయం కృతాపరాదంగానే పలువురు భావిస్తున్నారు. కానీ, ఆ తర్వాత షేక్పేట ఆర్ఐ నాగర్జునరెడ్డి ఓ భూ వివాదంలో రూ.30 లక్షల లంచం మాట్లాడుకుని రూ.15 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ కేసుతో తహసీల్దార్ సుజాతకు సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో ఆమె నివాసంలో సోదాలు చేపట్టగా.. రూ.30 లక్షలు నగదు, బంగారం లభ్యమైంది. దీంతో వరుసగా రెండు రోజులు ఏసీబీ విచారణకు హాజరైన తహసీల్దార్ సుజాతపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేశారు. దీంతో సుజాత జైలుకెళ్లగా.. ఆమె భర్త భవనంపై దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ కేసులో తహసీల్దార్ సుజాత ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కాగా, లంచం తీసుంటూ పట్టుబడ్డ ఆర్ఐ అగ్రవర్గానికి చెందిన వాడు. ఈ సమయంలో తహసీల్దార్.. ఆమె భర్త ఏసీబీ విచారణలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చినట్టుగా విశ్వాసనీయ సమాచారం. ఆ ఒత్తిడి కారణంగానే సుజాత భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో ఫిర్యాదుదారుడే తప్పుడు పత్రాలు సష్టించి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్టు తేలడంతో సదరు వ్యక్తి కటకటాల పాలయ్యాడు.

Advertisement

Next Story

Most Viewed