కశ్మీర్ వీరుడు ‘బిజు’కు మూడు దేశాలు సలాం..

by Sujitha Rachapalli |   ( Updated:2021-02-10 09:25:23.0  )
కశ్మీర్ వీరుడు ‘బిజు’కు మూడు దేశాలు సలాం..
X

దిశ,వెబ్‌డెస్క్ : ఒడిశా దివంగత సీఎం బిజు పట్నాయక్.. అనుకున్నాడంటే వెనకడుగు వేయని నైజం అతనిది. తన ముందున్నది ఎంత ప్రమాదకరమైన కార్యమైనా దేశ ప్రయోజనాల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టే స్వభావం అతనిది. అందుకే అతడో గొప్ప వీరుడు. ఆ లక్షణాలే ఆయన మరణాంతరం మూడు దేశాలను కన్నీటి పర్యంతమయ్యేలా చేశాయి. ఆయన త్యాగానికి గుర్తుగా శవపేటికపై మూడు దేశాలు తమ జాతీయ పతాకాలను కప్పి ఆయనకు నివాళులు అర్పించాయి. అలాంటి గొప్ప వ్యక్తి బిజు పట్నాయక్ సాహసాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

అది 1947. కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో కలిపేందుకు ఆ దేశానికి చెందిన కబాలిస్ అనే ‘గిరిజన మిలిటెంట్స్’ దళాలు దండెత్తాయి. కశ్మీర్‌ టెరిటరీలో ‘కబాలీస్ మారణకాండ’ మొదలు పెట్టారు. దొరికిన వారిని దొరికినట్టు చంపడం. కనిపించిన ఇండ్లలో చొరబడి దోచుకోవడం చేస్తున్నారు. వారిని అణచి వేసేందుకు భారత ప్రభుత్వం రెడీ అయింది. భద్రతా దళాలను కశ్మీర్‌కు పంపాలని నిర్ణయించింది. కానీ, అప్పటికే పరిస్థితి చేయి దాటి పోయింది. పాక్ గిరిజన మిలిటెంట్ దళాలు కశ్మీర్‌లో రోడ్లను బ్లాక్ చేసేశాయి. ఇక అక్కడికి చేరుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం కశ్మీర్ విమానాశ్రయం మాత్రమే.

అందరి మనసులో ఒకే భయం. శత్రువుల కండ్లు గప్పి కశ్మీర్‌లోకి బలగాలను ఎలా పంపాలి. ఆర్మీని యుద్ధ విమానం ద్వారా కశ్మీర్‌లోకి పంపక పోతే కశ్మీర్ మొత్తం శత్రువుల చేతిలోకి వెళ్లిపోతుంది. శత్రువుల కండ్లు కప్పి భారత జవాన్లను యుద్ధ విమానంలో కశ్మీర్‌కు తీసుకు వెళ్లే బాధ్యత ఎవరికి అప్పగించాలి. అంతటి సమర్థుడు.. చాకచక్యంగా పనిని పూర్తి చేసే ఆ నైపుణ్యం ఎవరికి ఉందని అంతా ఆలోచనలో పడ్డారు.

సరిగ్గా అప్పుడే ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ ఆ పనిని బిజు పట్నాయక్‌కు అప్పగించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రాయల్ ఇండియన్ ఏయిర్ ఫోర్స్‌లో ఆయనకు పైలట్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఆ సమయంలో హిట్లర్ పై యుద్దంలో సోవియట్ యూనియన్‌కు సహాయ సహాకారాలు అందించి గొప్ప గుర్తింపు పొందిన ఘనత ఆయనకే సొంతం. దీంతో భారత సైన్యాన్ని కశ్మీర్ చేర్చే బాధ్యత ఆయన భుజస్కందాలపై పెట్టారు.

సమాచారం అందుకున్న బిజు పట్నాయక్ రంగంలోకి దిగారు.. 1947 అక్టోబర్ 27న ఉదయం శత్రువుల కంట పడకుండా అత్యంత చాకచక్యంగా గుర్కా రెజిమెంట్ సైనికులను తన డకోటా డీ3 యుద్ద విమానంలో కశ్మీర్‌కు తరలించారు. ఆ సమయంలో ఆయన చూపిన సమయ స్పూర్తి, సాహసం అద్బుతం. ఆనాడు పట్నాయక్ సాహసోపేత కార్యం చేయకపోయి ఉంటే మనదేశంలో ప్రస్తుతమున్న కశ్మీర్ మొత్తం పాక్‌లో భాగంగా ఉండేది.

ఒక్క కశ్మీర్ మాత్రమే కాదు.. అటు ఇండోనేషియాకు స్వాతంత్య్రం రావడంలోనూ ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. 1945లో డచ్ వలస పాలన నుంచి ఇండోనేషియా విముక్తి పొందింది. అధ్యక్షుడు సుకర్నో.. ప్రధాని సుతాన్ షహరీర్ ఆధ్వర్యంలో స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ, డచ్ మాత్రం ఇండోనేషియాపై మళ్లీ మళ్లీ దండెత్తుతూ వచ్చింది. 1947లో ఆకస్మికంగా దండెత్తి ఆ దేశ ప్రధాని షహరీర్‌ను గృహ నిర్బంధంలో ఉంచింది.

ఈ విషయం భారత ప్రధాని నెహ్రూ దృష్టికి వచ్చింది. ఇండోనేషియాతో మన దేశానికి ఉన్న దౌత్య సంబంధాల నేపథ్యంలో వారికి సాయం చేయాలని నెహ్రూ భావించారు. వెంటనే బిజు పట్నాయక్‌ను పిలిచి.. షహరీర్‌ను బయటకు తీసుకు వస్తే డచ్ దురాగతాలను ప్రపంచం దృష్టికి తెలియ చేయవచ్చని నెహ్రు చెప్పారు.

దీంతో బిజు పట్నాయక్ మరోసారి తన డకోటా యుద్ధ విమానానికి పని చెప్పాడు. సింగపూర్ మీదుగా జకార్తా చేరేందుకు ప్రయాణమయ్యాడు. కాగా, ఇండోనేషియా గగన తలంలోకి ఆయన విమానం ప్రవేశించగానే దాన్ని పేల్చేయడానికి డచ్ సైనిక దళాలు ప్రయత్నించాయి. ఆ సమయంలో బిజు పట్నాయక్ తెలివిగా వ్యవహరించాడు. జకార్తా సమీపంలోనే తన విమానాన్ని ల్యాండ్ చేశాడు. అక్కడ జపాన్ సైన్యం సహకారంతో ఇంధనం నింపుకుని అక్కడ నుంచి నిర్ణీత ప్రదేశానికి చేరుకుని అనుకున్న పనిని సమర్థవంతంగా పూర్తి చేసుకువచ్చారు. అక్కడి వార్ జోన్‌లో చిక్కుకున్న ఎంతో మంది ఇండోనేషియన్లను సైతం సురక్షితంగా బయటపడేశారు.

బిజు పట్నాయక్ అందించిన సహాయ సహకారాలను ఇండోనేషియా ఇప్పటికీ మరిచిపోలేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయనకు ఇండోనేషియా పౌరసత్వంతో పాటు ‘భూమి పుత్ర’ అనే బిరుదుతో సత్కరించింది. అంతేకాకుండా ఇండోనేషియా 50వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయనకు ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘బెటాంగ్ జసా ఉటమ్’ను ప్రదానం చేసింది. ఇక్కడ మరో హైలెట్ ఎంటంటే.. ఆ దేశ తొలి అధ్యక్షుడు సుకర్నో కూతురికి బిజు పట్నాయకే నామకరణం చేశారు. తర్వాతి కాలంలో ఆమె ఇండోనేషియాకు ఐదో అధ్యక్షురాలిగా పని చేయడం గమనార్హం. బిజు పట్నాయక్ ధైర్యసాహసాలకు మెచ్చి ఆయన శవపేటికపై భారత్‌తో పాటు ఇండోనేషియా, రష్యా దేశాలు తమ జాతీయ పతాకాలను కప్పి నివాళ్లు అర్పించాయి.

కాగా అటు రాజకీయ రంగంలోనూ ఆయన విశిష్ట సేవలు అందించారు. ఒడిశా రాష్ట్రానికి రెండు సార్లు సీఎంగా పని చేశారు. అనేక ఇండస్ట్రీయల్ బెల్ట్స్, పారాదీప్, భువనేశ్వర్ ఏయిర్ పోర్టు, ఒడిశా ఏవియేషన్ సెంటర్ ఏర్పాటుతో సహా పలు అభివృద్ది ఫలాలు ఒడిశాకు అందించడంలో ఆయన చేసిన కృషి అమోఘం.

Advertisement

Next Story

Most Viewed