- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పువ్వు కోసిందని గ్రామ బహిష్కరణ
భువనేశ్వర్: ఒడిశాలో కుల వివక్ష జడలు విప్పింది. అగ్రకులానికి చెందిన భూమిలో ఓ పూవు కోసినందుకు దళితులు వెలి ఎదుర్కోవలసి వచ్చింది. ఊరి నుంచి సామాజిక బహిష్కరణకు గురికావలసి వచ్చింది. రేషన్ సరుకులు, ఉపాధి కోసం చేసుకునే కౌలుకూ నోచుకోకుండా ఊరవతల నివసించే 40 దళిత కుటుంబాలు రెండు వారాలుగా బోరుమంటున్నాయి. పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు చేయలేదు. శాంతి చర్చలు జరుపుతున్నా ఫలితం లేకుండా పోతున్నది.
ధేంకనాల్ జిల్లా కాంతియో కేట్ని గ్రామంలో 15 ఏళ్ల దళిత బాలిక అగ్రకుల కుటుంబం ఇంటి పెరట్లో ఒక పూవు కోయడంతో ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణ ప్రారంభమవగానే వెంటనే క్షమాపణలు కోరామని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రాధేయపడ్డామని ఆ బాలిక తండ్రి నిరంజన్ నాయక్ అన్నాడు. కానీ, ఆ ఘటన తర్వాత పలుసార్లు చర్చలు చేసి తమను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పాడు. 800 కుటుంబాలున్న ఆ ఊరిలో ఎవరూ తమతో మాట్లాడకూడదని, ఎలాంటి వేడుకలకు తమను ఆహ్వానించవద్దని ఆదేశాలు జారీ చేశారని వివరించాడు.
రేషన్ సరుకులు బంద్ చేశారని, నిత్యావసర సరుకులకూ 5 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తున్నదని మరో దళిత మహిళ జ్యోతి నాయక్ తెలిపారు. దీనిపై జిల్లా అధికారులకు, పోలీసులకు దళిత కుటుంబాలు ఈ నెల 17న ఒక మెమోరాండం సమర్పించారు. తమ కుటుంబాల్లో చాలా వరకు నిరక్షరాస్యులేనని, కౌలు మీద బతుకు వెళ్లదీస్తున్నామని, కానీ ఇప్పుడు కౌలుకూ అనుమతించకపోవడంతో ఉపాధి కోసం వెతుకులాడుకోవాల్సి వస్తున్నదని అందులో పేర్కొన్నారు. ఆ ఊరిలో పెళ్లి, అంత్యక్రియల ఊరేగింపూ చేయకూడదని, తమ పిల్లలు ఊరి ప్రభుత్వ పాఠశాలకు రావొద్దని, దళిత ఉపాధ్యాయులనూ అక్కడి నుంచి వేరే చోటకూ బదిలీ కావాలని హుకూం జారీ చేశారని వివరించారు.
కాగా, గ్రామ కార్యదర్శి ఈ ఘటనపై స్పందిస్తూ దళిత కుటుంబాలతో ఇతరులు మాట్లాడవద్దని మాత్రమే ఆదేశాలు జారీ అయ్యాయని, మిగతావన్ని నిరాధార ఆరోపణలని అన్నారు. ఇది రెండు కులాల మధ్య గొడవ అని, చర్చల ద్వారా పరిష్కారమవుతుందని, అగ్రకులాలు వారితో మాట్లాడటం మానేశాయని, అయితే, త్వరలోనే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని సర్పంచ్ ప్రాణబంధు దాస్ తెలిపారు. సబ్ కలెక్టర్ బిష్ణు ప్రసాద్ ఆచార్య స్పందిస్తూ… ‘వారు స్థానిక పోలీసులను సంప్రదించినా సంతృప్తికర పరిష్కారం లభించకపోవడంతో నా దగ్గరకు వచ్చారు. వారిని సబ్ డివిజనల్ పోలీసు అధికారిని కలవాల్సిందిగా సూచించారని, తాను కూడా శాంతి చర్చల్లో పాల్గొని సమస్య పరిష్కరిస్తాను’ అని తెలిపారు.