- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జాగలన్నీ కబ్జా.. కార్పొరేటర్ల హస్తం!
దిశ, న్యూస్ బ్యూరో: నగర కార్పొరేటర్ల పని తీరు చర్చనీయాంశంగా మారుతోంది. సంపాదనే ధ్యేయంగా వారు వ్యవహరిస్తున్న తీరుతో జనం బెంబేలెత్తుతున్నారు. శివారు ప్రాంతాలకు చెందిన కొందరు కార్పొరేటర్ల పేరు చెబితేనే జనం భయపడుతున్నారు. ఇండ్ల నిర్మాణాలకు అధికారుల అనుమతి కంటే వీళ్లు, వీరి అనుచరుల గ్రీన్ సిగ్నల్ తప్పనిసరిగా మార్చేశారు. పునాది రాయి వేసేముందు వారిని కలిసి రావాల్సిందే. లేదంటే స్థలాన్నే వివాదాస్పదం చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి ప్రాంతాలకు చెందిన కొందరు కార్పొరేటర్లు, వారి అనుచరులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఎల్బీనగర్లో ఓ కార్పొరేటర్ ముగ్గురికి ప్రతి నెలా రూ.20 వేల వంతున జీతాలిస్తూ కొత్త నిర్మాణాలపై నిఘా పెట్టిస్తున్నారు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నియోజక వర్గాల్లో ప్రభుత్వ స్థలాలు, చెరువులనే దిగమింగేశారు. కొందరు రిపోర్టర్లకూ స్థలాలు ఇస్తూ బయటికి పొక్కకుండా చూసుకుంటున్నారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రభుత్వ కార్యక్రమాల కంటే కార్పొరేటర్లు, వారి బంధువులు, అనుచరుల నిర్వాకమే ఎజెండాగా మారనుందన్న ప్రచారం సాగుతోంది. అలాంటి కార్పొరేటర్లకు టిక్కెట్టు కూడా కష్టమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్ఠానం సర్వే చేయించి అందరి చిట్టా సేకరించిందని సమాచారం.
ప్రైవేటు సైన్యం
కొందరు కార్పొరేటర్లు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు గల్లీ గల్లీ తిరిగి ఎక్కడ ఇల్లు కడుతున్నారో చూస్తున్నారు. అది అక్రమమంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. వివాదాస్పద భూములు, ప్లాట్ల కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నారు. అధికారులతో పనులు చేయించుకుంటున్నారు. బిల్డర్లను బెదిరిస్తూ అడ్డంగా దొరికిన కార్పొరేటర్లూ ఉన్నారు. భవన నిర్మాణదారులపై విరుచుకుపడ్డ సందర్భాలూ ఉన్నాయి. కొందరు కార్పొరేటర్ల సంతానం, బంధువులే బిల్డర్లుగా అవతారమెత్తారు. అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కూకట్ పల్లి నియోజకవర్గంలో చెరువులు, కుంటలు ఎన్ని? ఐదేండ్ల క్రితం వాటి విస్తీర్ణం ఎంత? ఈ నాలుగేం డ్లల్లో అక్కడ ఎన్ని ఇండ్లు నిర్మించారు? వాటి వెనకున్నదెవరో అందరికీ తెలుసు. అల్లాపూర్ డివిజన్ మైసమ్మ చెరువు విస్తీర్ణం 20 ఎకరాలకు పైగా ఉండేది. ఇప్పుడు మూడెకరాలకు మించి లేదు. నేటికీ ఆ ప్రాంతంలో నోటరీ మీద అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి. దీని వెనుక ఓ కార్పొరేటర్ భర్త హస్తం ఉందని స్థానికులందరికీ తెలుసు. మంత్రి కేటీఆర్ దృష్టికి ఈ విషయం వెళ్లినా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
నోటరీ భూములే పెట్టుబడి
ప్రభుత్వ భూములు ప్లాట్లుగా మారాయి. ఇండ్లు కూడా నిర్మించారు. నోటరీలతోనే కొనుగోలు, అమ్మకాలు సాగుతున్నాయి. హైదర్‌నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో వెంచర్లు వెలిశాయి. శంషీగూడలోనూ సర్కారు భూమి ప్లాట్లుగా మారింది. కొండాపూర్ డివిజన్ సిద్ధిఖినగర్ లో ప్రభుత్వ భూమి రెండు ఎకరాలు కబ్జాకు గురైంది. ఇదంతా టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులే చేసినా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. బిల్డర్లు, రియల్ వ్యాపారులు చేసే అక్రమాల వివరాలను కొందరు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరిస్తున్నారు. సామదాన భేద దండోపాయాల్ని ప్రయోగించి లక్ష నుంచి పది లక్షల వరకు గుంజుతున్నారు. వివాదాన్ని పరిష్కరించాలంటూ కార్పొరేటర్‌ను ఆశ్రయిస్తే, స్థలాన్ని తానే సొంతం చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. అక్రమాలకు దూరంగా, ప్రజాసేవే పరమావధిగా పని చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు ఉద్బోధ చేశారు. కానీ, వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు సరిపడా కూడబెట్టేశా రన్న విమర్శలు ఉన్నాయి.
ఫిర్యాదులు అనేకం
నాగోలు ప్రాంతంలోని ప్రతినిధి మీద ఓ ఇంటి యజమాని సీఎం కార్యాలయానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలో మరో ప్రతినిధి భర్త రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగింపు వ్యవహారాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. తొలగించిన దుకాణాల్ని మళ్లీ ఏర్పాటు సుకోవడానికి అనుమతి ఇప్పించి రూ.50 వేల వంతున వసూలు చేశారని అంటున్నారు. కూకట్‌పల్లి నాలాకు కాస్త దూరంలో 50 ఏళ్ల నుంచి పేదలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. కొందరు ఇప్పుడిప్పడే నిర్మాణాలు మొదలుపెడుతున్నారు. ప్రజాప్రతినిధి కుమారుడు రంగ ప్రవేశం చేసి ప్రతి నిర్మాణానికి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఉప్పల్, ఎల్బీనగర్ కు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు ముగ్గురు అనుచరులను నియమించు కున్నారు. వీరికి ద్విచక్ర వాహనాలను కొనిచ్చారు. వారి డ్యూటీ కొత్త భవనాలను వెతికి పట్టడమే. ఆ తర్వాత వసూలు చేసి కార్పొరేటర్, వారి భర్తకు ఇవ్వడమే.
11 వరకు వేచి ఉండాల్సిందే
గెలిచిన తర్వాత కాలనీలు, బస్తీలకు ఒక్కసారి కూడా రాని కార్పొరేటర్లు ఉన్నారు. ఎల్బీనగర్లోని ఓ కార్పొరేటర్ దగ్గరికి సమస్యలు చెప్పుకునేందుకు కాలనీవాసులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు వస్తే ఉదయం 11, మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి ఉండాల్సిందే. అప్పటి వరకూ ఆయన ఇంటి నుంచి బయటకు రారు. తాను మంత్రి కేటీఆర్ కు ప్రధాన అనుచరుడినని ప్రచారం చేసుకుంటారు. ఎమ్మెల్యే టికెట్టు కాస్తలో మిస్ అయ్యిందంటారు. అలాంటి వ్యవహారంతో విసిగిపోయిన జనం కార్పొరేటర్ దగ్గరికి వెళ్లడమే మానేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల దగ్గరికి లైను కడుతున్నారు.