- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
త్వరలో నర్సింగ్ డైరెక్టరేట్.. సర్కార్ కసరత్తు!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేళ్లకు పూర్తిస్థాయిలో నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇంతకాలం వైద్య విద్య డైరెక్టరే ఈ వ్యవహారాలన్నీ చూస్తున్నా ఇకపైన ఫుల్‌టైమ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఉత్తమం అని వైద్యారోగ్య శాఖ ఒక అభిప్రాయానికి వచ్చింది. నర్సులకు సంబంధించిన అనేక అంశాలు, సమస్యలు, పరిష్కారాలు, విధాన నిర్ణయాలు.. ఇలా అన్నింటి పర్యవేక్షణకు పూర్తిస్థాయి డైరెక్టరేట్ ఏర్పాటు చేయడం అనివార్యమన్న అభిప్రాయానికి వచ్చినందునే ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి తోడు త్వరలో నర్సింగ్ కౌన్సిల్‌కు ఎన్నికలను నిర్వహించాలని కూడా ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లుగానే తెలంగాణలోనూ స్టయిఫండ్ పెంపు నిర్ణయం దిశగా కసరత్తు మొదలైంది.
తెలంగాణలో సుమారు 32 వేలకు పైగా నర్సులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుని ఉన్నా ఇప్పటివరకు పూర్తి స్థాయి నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు కాలేదు. దీర్ఘకాలంగా నర్సులు దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. నర్సులకు సంబంధించిన సమస్యలు, పరిష్కారాలు, ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో జాప్యం జరుగుతున్నదని నర్సులు ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో మొరపెట్టుకున్నారు. కానీ వైద్య విద్య డైరెక్టర్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించి ఏడేళ్ళుగా నెట్టుకొస్తూ ఉన్నది.
కాలేజీలు పెరుగుతున్నందునేనా..?
రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల కొత్త మెడికల్ కళాశాలలను, వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న ఎనిమిది నర్సింగ్ కాలేజీలకు అదనంగా 13 కొత్తగా ఏర్పాటుకానున్నాయి. ఎనిమిది నర్సింగ్ కాలేజీల నుంచి ప్రతీ ఏటా సగటున 320 మంది విద్యార్థులు కోర్సు ముగించుకుని క్వాలిఫై అయ్యి సర్వీసులోకి వస్తున్నారు. ఇక ప్రైవేటు రంగంలోని 78 కాలేజీల నుంచి సుమారు 3,120 మంది ఉత్తీర్ణులవుతున్నారు. ఇవికాక ఆరు ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్ళ నుంచి 270 మంది, ప్రైవేటులోని 150 స్కూళ్ళ నుంచి 6,750 మంది క్వాలిపై అవుతున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ తదితరాలన్నీ కలుపుకుంటే సుమారు 12 వేల మందికి పైగానే నర్సులు ఉనికిలోకి వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే కాలేజీలతో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది.
దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయడం అవసరం అని భావించినట్లు వైద్యారోగ్య శాఖ వర్గాల సమాచారం. కొత్తగా మెడికల్ కాలేజీలు కూడా వస్తున్నందున వైద్య విద్య డైరెక్టర్ ఇప్పుడు ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన తీరులో నర్సింగ్ కాలేజీలకు కూడా కొనసాగడంలో ఇబ్బందులు ఉంటాయని, పని భారంతో ఆశించిన ఫలితాలు రావని భావించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని కొద్దిమంది నర్సులకు ఇటీవల వైద్య విద్య డైరెక్టర్ సూచనప్రాయంగా తెలిపారు.
వైద్యారోగ్య శాఖ పరిధిలో పనిచేసే నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుకావడం ద్వారా నర్సింగ్ వృత్తిలో సీనియారిటీ ఉన్నవారు డైరెక్టర్ అవుతారు. వారి కింద ఒక జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు, వారి కింద సహాయక సిబ్బంది.. ఇలా మొత్తం వ్యవస్థ ఏర్పాటవుతుంది. ఇక నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ హోదా జాయింట్ డైరెక్టర్‌కు సమంగా ఉండనుంది. పదోన్నతి లభించినట్లయితే డైరెక్టర్ స్థాయికి కూడా వెళ్ళవచ్చని ఆర్గనైజేషన్ సెటప్ ముసాయిదాలో ప్రభుత్వం రూపొందించింది.
నర్సులకు స్టయిఫండ్ పెంపు
కరోనా సమయంలో నర్సుల సేవలను గుర్తించిన ప్రభుత్వం రిక్రూట్‌మెంట్‌పై దృష్టి పెట్టింది. అయితే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతులపైనే ఆధారపడుతున్నందున ఇకపైన రెగ్యులర్ పోస్టింగ్‌ల్లోనే నియమించాలనుకుంటున్నది. బోధనా సిబ్బందిని, ఇకపైన రిక్రూట్ చేసుకోబోయే నర్సులను రెగ్యులర్ ప్రాతిపదికన తీసుకుంటామని వైద్య విద్య డైరెక్టర్ సంకేతాలిచ్చినట్లు తెలిసింది. ఇంతటి సేవ చేస్తున్న నర్సులకు స్టయిఫండ్‌ను కూడా పెంచాలనుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పెంచిన విషయాన్ని తెలుసుకుని ఆ జీవో ప్రకారమే తెలంగాణలోనూ పెంచే నిర్ణయాన్ని త్వరలో తీసుకోవాలనుకుంటున్నది. ఆ జీవోపై ఇప్పటికే వైద్యారోగ్య శాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
మరోవైపు కొత్త నర్సింగ్ కళాశాలల ద్వారా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణులయ్యి సర్వీసులోకి వస్తున్నందున వారి ఎన్‌రోల్‌మెంట్ కోసం నర్సింగ్ కౌన్సిల్‌ను కూడా ప్రభుత్వం పటిష్టం చేయాలనుకుంటున్నది. ప్రతీ మూడేళ్ళకోసారి జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ ఇప్పటివరకూ లేనందున త్వరలో నిర్వహించాలనుకుంటున్నది. ప్రతీ నర్సింగ్ అసోసియేషన్ నుంచి కౌన్సిల్‌లో ప్రాతినిధ్యం ఉండేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఎన్నికల నిర్వహణకు ఇంకా షెడ్యూలు ఖరారు చేయకపోయినప్పటికీ ఏటేటా నర్సుల సంఖ్య పెరుగుతుండడంతో వారి సమస్యలు, పరిష్కారాలు, విధాన నిర్ణయాలు తదితరాలపై వాటి సంబంధించిన యంత్రాంగమే నిర్ణయం తీసుకోవడం సమంజసంగా ఉంటుందన్నది వైద్యారోగ్య శాఖ వర్గాల భావన.
త్వరలోనే నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు, నర్సింగ్ కౌన్సిల్ ఎన్నికలు, నర్సులకు స్టయిఫండ్ పెంపు తదితరాలపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.