వారం రోజుల్లో మూడు‌న్నర లక్షల కేసులు

by Anukaran |   ( Updated:2020-08-03 11:35:19.0  )
వారం రోజుల్లో మూడు‌న్నర లక్షల కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి వేగం రోజురోజుకు పెరుగుతోంది. ఒక్కరోజులో నమోదయ్యే కొత్త కేసులు వరుసగా అయిదో రోజు 50వేల మార్కు దాటాయి. కేవలం వారంరోజుల్లోనే దేశవ్యాప్తంగా 3లక్షల 70 వేల కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే‌సరికి గడిచిన 24 గంటల్లో 52,972 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 18,03,695కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ బారిన పడి ఒక్కరోజే 771 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 38,135కు చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 11లక్షల 86వేల మంది కోలుకోగా ప్రస్తుతం 5లక్షల 79వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగా ఢిల్లీలో మాత్రం గతంతో పోలిస్తే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. 24గంటల్లో కొత్తగా నమోదైన 937 కేసులతో కలిపి ఢిల్లీలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,38,482కు చేరింది. కొత్తగా17 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 4021 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజులో 8,968 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 4,50,196కు వెళ్లింది. 24గంటల్లో 266మంది చనిపోగా మొత్తం మరణాలు 15,842కు చేరాయి. తమిళనాడులో 24గంటల్లో 5609 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 2,63,222కు చేరింది. ఇక్కడ కరోనాతో 109మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 4241కు చేరింది. గుజరాత్‌లో ఇప్పటివరకు 64,648 కేసులకుగాను 2500 మంది మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో గడిచిన 24గంటల్లో 7,822కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,66,586కు చేరింది. ఒక్కరోజే కరోనాతో 63మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 1537 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Next Story

Most Viewed