2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం : ఎన్‌టీపీసీ

by Harish |
NTPC
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ యాజమాన దిగ్గజ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ 2032 నాటికి 60 గిగావాట్ల(జీడబ్ల్యూ) పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఆదివారం వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి హై-లెవల్ డైలాగ్ ఆన్ ఎనర్జీ(హెచ్ఎల్‌డీఈ)లో భాగంగా ఎన్‌టీపీసీ ఇంధన ఉత్పత్తి లక్ష్యాలను ప్రకటించిన మొదటి సంస్థగా నిలిచింది. అంతేకాకుండా క్లీన్ ఎనర్జీ పరిశోధనను సులభతరం చేసేందుకు 2025 నాటికి రెండు అంతర్జాతీయ భాగస్వామ్యాలను కలిగి ఉండనున్నట్టు ఎన్‌టీపీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది సెప్టెంబర్‌లో సుస్థిర అభివృద్ధి కోసం ఇంధన సంబంధిత లక్ష్యాలు, లక్ష్యాల అమలు-2030 ఎజెండా ఉన్నతస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా పునరుత్పాదక ఇంధనానికి సంబంధించి గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉండేందుకు ఎన్‌టీపీసీ తన గ్రీన్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియో కోసం వివిధ చర్యలు తీసుకుంటోంది. గతంలో ఎన్‌టీపీసీ 2032 నాటికి మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు 25 శాతం ఉండే పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా కనీసం 32 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా ఉండేది. తాజా లక్ష్యాల మార్పుల ద్వారా గ్రీన్ ఎనర్జీ విభాగంలో ఎన్‌టీపీసీ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed