‘పెగాసస్’ వంటి టెక్నాలజీతో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు..

by Shamantha N |
pegasus 1
X

న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో ‘పెగాసస్’ వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో దాని తయారుదారు ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్‌ఓ గ్రూపు స్పందించింది. తాము రూపొందించిన నిఘా సాఫ్ట్‌వేర్ పెగాసస్ వంటి సాంకేతికతలు దర్యాప్తు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు అందుబాటులో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రాత్రుళ్లు హాయిగా నిద్రపోతున్నారని, వీధుల్లో సురక్షితంగా నడవగలుగుతున్నారని తెలిపింది. ఈ టెక్నాలజీని తాము ఆపరేట్‌ చేయడంగానీ, తమ క్లయింట్ల డేటా సేకరించడం గానీ జరగదని స్పష్టం చేసింది.

భారత్‌ సహా అనేక దేశాల్లోని జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులతోపాటు ఇతర ఉన్నతాధికారులపై పెగాసస్ స్పైవేర్‌‌తో నిఘా పెట్టారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యతపై ఆందోళన నెలకొంది.

ఈ క్రమంలో ఎన్ఎస్ఓ ప్రతినిధి ఒకరు స్పందించారు. ‘పెగాసస్ వంటి టెక్నాలజీల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇలాంటి సాంకేతికతలు నిఘా ఎజెన్సీలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎజెన్సీలకు అందుబాటులో ఉండటం వల్ల నేరాలు, ఉగ్రవాదం వంటి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ముందస్తుగా అడ్డుకోగలుగుతున్నారు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ యాప్‌ల గొడుగు క్రింద దాక్కుంటున్న నేరస్థులను పట్టుకోవడానికి, వారిపై దర్యాప్తు చేయడంలో దోహదపడుతాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రాత్రుళ్లు హాయిగా నిద్రిస్తున్నారు. వీధుల్లో సురక్షితంగా నడుస్తున్నారు. ప్రపంచాన్ని సురక్షితంగా మార్చేందుకు మా వంతు కృషి చేస్తున్నాం’ అని వివరించారు.

‘సైబర్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను ప్రపంచంలోని చాలా సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీలతో కలిసి ప్రభుత్వాలకు ఎన్ఎస్ఓ సమకూర్చుతున్నది. ప్రపంచవ్యాప్తంగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు సమాచారం అందని స్థితిలో ఉన్నాయి. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో దురుద్దేశపూరితమైన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు లా ఎన్‌పోర్స్‌మెంట్ ఏజెన్సీలకు రెగ్యులేటరీ పరిష్కారం లేదు’ అని తెలిపారు.

Advertisement

Next Story