ఆపత్కాలంలో అదుకున్న ‘ఉపాధి’

by Shyam |
ఆపత్కాలంలో అదుకున్న ‘ఉపాధి’
X

దిశ, న్యూస్ బ్యూరో : ఉపాధిహామీ ఆదుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకంతో కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా కష్టకాలంలో ఉపాధి పనులు కలిసి వచ్చాయి. గ్రామాల బాట పట్టిన జనమంతా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగస్వాములయ్యారు. ఇటు నగరాలు, పట్టణాలలో పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రైవేట్ ఉద్యోగాలలో కోత విధించారు. పలువురిని విధుల నుంచి తొలగించారు. పాలకులు ప్రత్యమ్నాయ చర్యలు చేపట్టలేదు. పైగా తమ ఉద్యోగుల వేతనాలలోనే కోత పెట్టారు. దీంతో ప్రైవేట్ కంపెనీలు ఇష్టారీతిన ఉద్యోగులను తొలగించాయి. ప్రభుత్వమే ఆర్థిక లేమి కారణంగా వేతనాలివ్వలేని పరిస్థితుల్లో తామేం చేస్తామంటూ చేతులెత్తేశాయి. వారిని అడిగేందుకు కూడా అధికారులు సాహసించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆదుకుంది. ఎక్కడా లేని విధంగా విద్యావంతులు, ప్రైవేట్ ఉద్యోగులు ఉపాధి పనులకు వెళ్లారు. మే నెలలోనే ఉపాధిహామీలో 9,85,694 మంది యువతీ, యువకులు కొత్తగా పనులు చేశారు. 79 వేల కొత్త జాబ్ కార్డులు మంజూరు చేశారు.

9.53 కోట్ల పని దినాలు

రాష్ట్రంలో కేవలం మూడు నెలల్లోనే 9,53,05,769 పని రోజులు పూర్తి అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 13 కోట్ల పని రోజులు టార్గెట్ ఉండగా, మూడు మాసాలలోనే పది కోట్లకు చేరువయ్యారు. 27,12,871 కుటుంబాలకు పని దొరికింది. ఇందులో 2,12,64,950 మంది ఎస్సీ లబ్ధిదారులున్నారు. ఎస్టీ కూలీలు 1,99,88,925 మంది, బీసీ కూలీలు 4,83,97,332 మంది, మైనార్టీలు 12,91,817 మంది, ఇతర వర్గాలు 43,62,745 మంది ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. 20,12,425 మంది పురుషులు, 26,36,080 మంది మహిళలు ఉపాధి పనులు చేశారు. వికలాంగులు 2,25,343 మంది కూలీ పనులకు వెళ్లారని తేలింది.

కూలి గిట్టుబాటు కాలే

ఉపాధి పనులు ఎక్కువగా జరిగినా, కూలి చెల్లింపులు మాత్రం తక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు కూలీలకు శాపంగా మారాయి. ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో పంచాయతీ కార్యదర్శులకు అధికారాలు ఇవ్వడంతో, వారు పనిభారంతో కొలతలు సరిగా చేయలేక చేశారు. దీంతో తక్కువ వేతనం వచ్చింది. వాస్తవంగా కేంద్రం సగటు కూలీ రూ. 267 ఉన్నప్పటికీ, మన రాష్ట్రంలో రూ.161కి మాత్రమే పరిమితమైంది. చాలా మందికి రూ.80 నుంచి రూ.100 వరకు వచ్చాయి.

ఉపాధి ఉద్యోగులపై కత్తి

రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల భవిష్యత్తును ఆందోళనలో పడేసింది. వారంతా ప్రస్తుతం పని లేక ఖాళీగా ఉంటున్నారు. సమస్యల పరిష్కారానికి సమ్మెకు దిగినా ప్రభుత్వం దిగిరాకపోవపడంతో విరమించారు. అయినా వారిని విధుల్లోకి తీసుకోవడం లేదు. తాజాగా ప్రభుత్వం ఉపాధిలో పలు పనులను అదనంగా చేర్చింది. ఇరిగేషన్ విభాగంలో కాల్వలు, మట్టి తీయడం వంటి పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఆర్అండ్‌బీలో రోడ్ల పనులు కూడా చేపట్టనున్నారు. ఈ పనులను ఐబీ ఏఈలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అలా అయితే పనులు జరుగడం అనుమానమేనని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఐబీ ఇంజనీర్లు రెండు, మూడు మండలాలకొకరు ఉన్నారు. ఉపాధి పనులు గ్రామ స్థాయిలో చేయాల్సి ఉంటుంది.

పైసలన్నీ కేంద్రానివే

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉపాధిహామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం తక్కువ నిధులను వెచ్చిస్తోంది. కేంద్రం వాటా 90 శాతం ఉండగా, రాష్ట్రం వాటా 10 శాతమే. మిషనరీ పనుల్లో కేంద్రం వాటా 70 శాతం ఉండగా, రాష్ట్రం వాటా 30 శాతం మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.161 కోట్లను విడుదల చేసింది. మిగిలిన సొమ్ము మొత్తం కేంద్రానిదే. ఈ నేపథ్యంలో పనులను పర్యవేక్షించే ఉపాధి సిబ్బందిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తొలగించే కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed