కొవిడ్ ఆస్పత్రులకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందా?

by Anukaran |   ( Updated:2021-05-07 10:40:05.0  )
North Discom
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా పాజిటివ్ పేషెంట్లతో ఆస్పత్రుల్లో బెడ్‌లన్నీ నిండిపోవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఒకవైపు వేసవి కాలంలో పెరిగే విద్యుత్ డిమాండ్‌కు అదనంగా ఈసారి ఆస్పత్రుల్లో మాగ్జిమమ్ స్థాయిలో వినియోగం జరుగుతోంది. గ్రిడ్‌పైన భారం, సరఫరాలో హెచ్చతగ్గులకు ఆస్కారం ఉన్నప్పటికీ సాంకేతికంగా అన్ని చర్యలూ తీసుకుంటున్న ఉత్తర డిస్కం ఏ సమయంలోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని అనుమానిస్తోంది.

అసలే ఐసీయూ, ఆక్సిజన్ వార్డుల్లో వెంటిలేషన్‌పై పేషెంట్లు వందల సంఖ్యలో ఉండడంతో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది ఏర్పడితే ప్రాణాలకు ప్రమాదం వస్తుందని భావించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలను డిస్కంల సూపరింటెండింగ్ ఇంజనీర్లు అప్రమత్తం చేశారు.

ఆస్పత్రుల్లో పేషెంట్ల అత్యవసర అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం యాజమాన్యాలు డీజిల్ జెనరేటర్లను సిద్ధం చేసుకోవాలని, విద్యుత్ సరఫరాలో ఏ మాత్రం ఇబ్బంది ఏర్పడినా వెంటనే వాటి ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించుకోవాలని స్పష్టం చేసింది. అయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చని ఆ మెసేజ్‌లో ఆస్పత్రుల యాజమాన్యానికి సూచన చేసింది. ప్రస్తుతం అకాల వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురుగాలులు, జూన్ మొదటి వారం తర్వాత వర్షాకాలం ప్రవేశిస్తుండడంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం అప్రమత్తం చేసినట్లు డిస్కం అధికారులు పేర్కొంటున్నారు.

సిబ్బందిపై కరోనా ఎఫెక్ట్

ఉత్తర డిస్కం పరిధిలోని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు గత నెల రోజులుగా భారీ స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల ఎన్నికలు జరిగిన వరంగల్, ఖమ్మం నగరాల్లో భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు పుట్టుకొచ్చాయి. ఉత్తర డిస్కం సిబ్బంది సైతం పదుల సంఖ్యలోనే వైరస్ బారిన పడ్డారు. ఈ కారణంగానే ప్రతీ నెలా మొదటి వారంలో ఇంటింటికీ తిరిగి మీటర్ రీడింగ్ తీసుకునే బిల్ కలెక్టర్లను ఈ నెల ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఏ ఇంటికి పోతే కరోనా ఎలా సోకుతుందోననే భయంతో పాటు చాలా మంది క్వారంటైన్‌లో ఉన్న కారణంగా షెడ్యూలు ప్రకారం రీడింగ్ తీసుకోవడంలో ఇబ్బందులూ ఉన్నాయి. మీటర్‌లోని రీడింగ్‌ను తీసుకునే బాధ్యతను ఇండ్ల యజమానులకు అప్పజెప్పి ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేయాలని కూడా సూచించింది.

ఇప్పటికీ చాలా మంది క్వారంటైన్‌లో ఉండడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన తర్వాత అందుబాటులో ఉన్న సిబ్బందిని అక్కడికి పంపడానికి సమయం పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సరఫరాను పునరుద్ధరించడానికి వీలుగా డీజిల్ జనరేటర్ల మీద ఆధారపడాల్సిందిగా అప్రమత్తం చేసింది. రెప్పపాటు కరెంటు పోదని, నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నామని ఇప్పటిదాకా చెప్పుకుంటుండగా రకరకాల కారణాలతో ఇబ్బందులు ఏర్పడి పేషెంట్ల ప్రాణాలకు కారణమైతే ఆ బాధ్యతను తనమీద కాకుండా ప్రైవేటు ఆస్పత్రులకు అంటించేలా జాగ్రత్తలు తీసుకుంది.

ప్రస్తుతం అప్రమత్తం చేయడాన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యం స్వాగతించి దానికి అనుగుణంగా డీజిల్ జెనరేటర్లను సిద్ధం చేసుకుంటున్నా రానున్న కొద్ది కాలం రెగ్యులర్ కరెంటు సప్లయ్‌కి ఇబ్బంది రావచ్చనే ఆందోళనలో పడ్డాయి.

Advertisement

Next Story