సైడ్ బిజినెస్.. పబ్లిక్ టాయ్‌లెట్‌లో మటన్, ఎగ్స్ విక్రయం!

by Anukaran |
సైడ్ బిజినెస్.. పబ్లిక్ టాయ్‌లెట్‌లో మటన్, ఎగ్స్ విక్రయం!
X

దిశ, వెబ్‌డెస్క్ : కాసుల వేటలో నిమగ్నమైన వ్యాపారులు ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు. డబ్బులు వస్తున్నాయా లేదా అనే విషయం తప్ప పరిశుభ్రత, ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బులు వెనకేసుకుంటున్నారు. ప్రధానంగా మాంసం విక్రయదారులైతే ఫుడ్ సేఫ్టీ అధికారుల సూచనలు, ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. నిల్వ చేసిన మాంసాన్ని విక్రయించడమే కాకుండా, మురికి కాలువల వెంట దుకాణాలను ఓపెన్ చేసి అమ్మకాలు జరుపుతున్నారు.

దానికి తోడు మాంసం విక్రయ సమయంలో మిగిలిపోయిన వ్యర్థాలను రోడ్డు పక్కనే పడేయడంతో ఈగలు, దోమలు మాంసంపై వాలడాన్ని సైతం మనం చూస్తునే ఉంటాం. అయినా కూడా నాన్‌వెజ్ తీసుకునేందుకు కస్టమర్లు ఏమాత్రం వెనుకాడరు. నాన్‌వెజ్ మీద ఉండే ఇష్టమే అందుకు ప్రధాన కారణం. ప్రపంచ వ్యాప్తంగా మాంసం తినే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. అలాగే, మన ఇళ్లల్లో ఏ చిన్న అకేషన్ జరిగినా నాన్‌వెజ్ తప్పక ఉండాల్సిందే. ఒక్కరోజు నాన్‌వెజ్ లేకుండా ఉండని వారు సైతం చాలా మందే ఉన్నారు. అలాంటిది వ్యాపారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. నిల్వచేసిన మాంసం, ఈగలు, దోమలు వాలినది తినడం వలన అనారోగ్యం బారిన పడే అవకాశం అధికంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయించడమే పెద్ద తప్పు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఏకంగా పబ్లిక్ టాయ్‌లెట్‌లో మటన్, కోడిగుడ్లను విక్రయిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ విస్మయానికి గురిచేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పబ్లిక్ టాయ్‌లెట్‌‌లో పనిచేసే వ్యక్తి సైడ్ బిజినెస్ కోసం అందులోనే నాన్‌వెజ్‌ను విక్రయిస్తున్నాడు. గత కొంతకాలంగా గుట్టుగా నడుస్తున్న ఈ విషయం ఆలస్యంగా మున్సిపల్ అధికారుల చెవిన పడటంతో వారంతా ఒక్కసారిగా షాకయ్యారు.

దీంతో అప్రమత్తమైన ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. టాయ్‌లెట్‌లో మాంసం, ఎగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్ కమిషనర్ రాజన్ గౌకర్ వెల్లడించారు. ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న టాయ్‌లెట్ కేర్ టేకర్‌కు స్పాట్‌లో రూ.1000 జరిమానా విధించారు. అంతేకాకుండా ఆ కాంప్లెక్స్‌ను నడిపిస్తున్న NGO సంస్థకు రూ.20వేల ఫైన్ వేసినట్లు ప్రకటించారు.

Advertisement

Next Story