సింగరేణిలో సీనియర్స్ హవా.. కానరాని యువకులు.. ఎందుకంటే?

by Sridhar Babu |   ( Updated:2021-09-06 04:04:49.0  )
సింగరేణిలో సీనియర్స్  హవా.. కానరాని యువకులు.. ఎందుకంటే?
X

దిశ,గోదావరిఖని : దేశానికి వెలుగులను విరజిమ్మే 120 సంవత్సరాల సింగరేణి సంస్థలో యువనాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెప్తున్న నాయకుల మాటలు నీటిమూటలుగా మిగిలిపోతున్నాయి. ఏళ్ల తరబడి పదవుల్లో ఉన్న సీనియర్‌లే సింగరేణి యూనియన్‌లో కొనసాగుతున్నారు. సింగరేణిలో యువతకు ప్రాధాన్యతను కల్పిస్తున్నామని ఎంతో మంది అధికారులు గొప్పలు చెప్పడమే తప్ప చేసేది ఏమీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సింగరేణి వ్యాప్తంగా ఎంతో మంది యువత పలు రంగాల్లో ఉద్యోగాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఆ యూనియన్‌లో కానీ, మరొక చోట కానీ, సరైన పదవులు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణిలో ఏర్పడిన యూనియన్‌లో సీనియర్ నాయకులే కొనసాగుతున్నారు. కానీ, ఎక్కడ కూడా యూనియన్‌లో యువతకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికుల పరిష్కారమే దిశగా పనిచేస్తున్న సింగరేణిలో యువ నాయకత్వం కనిపించడం లేదు. కనీసం కిందిస్థాయి పదవులు కూడా యువతకు లేకపోవడం సింగరేణిలో ఏ మేరకు అధికారం కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఏళ్ల తరబడి సింగరేణిలో పదవులు ఉన్న యువతకు ప్రాధాన్యం దక్కకపోవడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సింగరేణిలో యువత కీలకమని ప్రకటనలు చేస్తున్న అధికారులకు సింగరేణిలో యువత కనిపించడం లేదా అని పలువురు విమర్శిస్తున్నారు. సింగరేణి విస్తరించి ఉన్న దాదాపు 11 ఏరియాలో దాదాపు 43500 కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో సుమారుగా దాదాపు 22 వేల మంది కార్మికులు 45 సంవత్సరాల లోపు గల కార్మికులు ఉన్నారు. వీరిలో చాలామంది గతంలో విద్యార్ధి సంఘాల్లో, తెలంగాణ ఉద్యమంలో, సామాజిక కార్యక్రమంలో, పనిచేసిన వారు ఉన్నారు. కానీ సింగరేణి ట్రేడ్ యూనియన్ సార్ యూనియన్‌లలో వీరి పాత్ర కనిపించడం లేదు. కొందరు రిటైర్డ్ అయిన కార్మిక సంఘాల నాయకులు వీరిని రాకుండా అడ్డుకుంటున్నారని కార్మికులు చర్చించుకుంటున్నారు. ఈ యువ కార్మికుల్లో మెజారిటీ కార్మికులు డిగ్రీలు, పీజీలు ఉన్నత చదువులు చదివి కంపెనీ మీద, ట్రేడ్ యూనియన్ చట్టాల మీద అవగాహన కలిగిన ఏంతో మంది యువ నాయకులు ఉన్నారు. రానున్న ట్రేడ్ యూనియన్ సింగరేణి ఎలక్షన్ లలో వీరి పాత్ర కీలకం కానున్నదనే వాదనలు సింగరేణి సంస్థలో వినిపిస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా సింగరేణిలో మాత్రం అన్ని యూనియన్‌లలో రిటైర్డ్ కార్మిక నాయకుల హవానే కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పుడున్న యువ కార్మికులు రిటైర్డ్ కార్మిక నాయకుల పెత్తనం పై పెదవి విరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కొందరు స్వలాభం కోసమే పైరవీలు, దందాల కోసమే ఈ రిటైర్డ్ ఖద్దరు చొక్కాల కార్మిక నాయకులు వివిధ గనులపై ప్రోటోకాల్ పేరిట అధికారులను, కింది స్థాయి నాయకులను వేధిస్తున్నారని ఏంతో మంది కార్మికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. సింగరేణిలో యువ నాయకత్వం రావడం వలన ఈ పైరవీలకు చెక్కు పెట్టే అవకాశం ఎంతైనా ఉంటుందని పలువురు రాజకీయ నాయకులు భావిస్తున్నారు. కార్మికులకు ప్రతి సమస్యలపై సర్క్యులర్‌లపై సవివరంగా వివరించే అవకాశం సైతం యువ సింగరేణి నాయకత్వానికి ఉండటంతో తద్వారా కార్మికుల అవసరాలు కూడా అవినీతి రహితంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. దీనితో కంపెనీ పురోభివృద్ధికి కూడా బాటలు పడే అవకాశం ఉంటాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా కోల్ ఇండియాలో, సింగరేణిలో రిటైర్డ్ కార్మిక నాయకుల రిప్రజెంటేషన్, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం నిలుపుదల చేయాలని, దీని పైన చర్చించాలని కోల్ ఇండియా కు కూడా సూచించడం కూడా శుభ సూచకమే, అయినా ఇప్పటి వరకు అది సింగరేణిలోఅమలు కావడం లేదు. కనీసం రానున్న రోజుల్లో అయినా సింగరేణిలో యువ నాయకత్వానికి అవకాశం కల్పిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed