సీఎం హామీలపై ట్రెసా సెంట్రల్ ​కమిటీ ఆవేదన

by Shyam |   ( Updated:2021-07-14 05:54:41.0  )
Teresa Central Committee
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ ఉద్యోగులకు ఏడాది క్రితం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని, అన్ని శాఖల్లో పదోన్నతులు కల్పించి, రెవెన్యూ శాఖలో ప్రమోషన్లు ఇవ్వకపోవడం బాధాకరమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ ​సర్వీసెస్ ​అసోసియేషన్ ​సెంట్రల్​ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కింది స్థాయి ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అభిప్రాయపడింది. ఈ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం హైదరాబాద్​లోని ట్రెసా కార్యాలయంలో సెంట్రల్​ కమిటీ అధ్యక్షుడు వంగా రవీందర్​రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. రాష్ట్ర ముఖ్య నాయకులు అత్యవసరంగా సమావేశమై రెవెన్యూ శాఖకు చెందిన పలు సమస్యలపై చర్చించారు.

సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కొరకు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో రెవెన్యూ ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంథ్ ను స్థిరీకరించాలన్నారు. ఆర్డర్ టూ సర్వ్ కింద ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు పంపిన రెవెన్యూ ఉద్యోగులను వారి ఆప్షన్ల ప్రకారం బదిలీలు చేపట్టాలని, నూతన రెవెన్యూ చట్టం ప్రకారం అన్ని క్యాడర్ ఉద్యోగుల జాబ్ చార్ట్ రూపొందించాలని డిమాండ్​చేశారు. సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ట్రెసా నిర్ణయించింది.

వివిధ అంశాలపై అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు మన్నే ప్రభాకర్, ఉపాధ్యక్షుడు కె.రామకృష్ణ, మంజుల కార్యదర్శి బాణాల రాంరెడ్డి, క్రీడా కార్యదర్శి బి.రవీందర్, సీసీఎల్ఎ యూనిట్ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు, శ్రీకాంత్ రెడ్డి,సంతోష్ లాల్, శ్రీనివాస్, రాంబాబు, చిన్న వెంకట్, సురేష్, వెంకటేశ్వర్లు, నారాయణ రెడ్డి తదితరులు చర్చించి ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు.

డిమాండ్లు ఇవే..

* కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగులకు ఆప్షన్ల మేరకు జిల్లాలకు కేటాయించాలి.
* సీఎం కేసీఆర్​ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న తహశీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్లుగా, డిప్యూటీ కలెక్టర్ల నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా, వివిధ క్యాడర్ల పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి. అలాగే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి కల్పించేందుకు నూతనంగా సెలక్షన్ గ్రేడ్ ఏర్పాటు చేయాలి.
* సీసీఎల్ఏ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్ట్ నియమించాలి. అర్హత గల ఉద్యోగులకు సూపరింటెండెంట్ గ్రేడ్ -1గా పదోన్నతి కల్పించాలి. ఆయా జిల్లాల నుండి సీసీఎల్ఎ కార్యాలయంలో రేషియో ప్రకారం పని చేస్తున్న డిప్యూటేషన్ పద్ధతిన పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.
* సీఎం కేసీఆర్​హామీ ప్రకారం వీఆర్ఏలకు స్కేలు వర్తింపచేయాలి. వీఆర్వోలను శాఖలో సర్దుబాటు చేయాలి. అలాగే కంప్యూటర్ ఆపరేటర్లను క్రమబద్దీకరించుటకు తగు చర్యలు చేపట్టాలి.
* ఇటీవల పోస్టింగ్లు ఇచ్చిన ప్రొబేషనరీ నాయబ్ తహసీల్దార్లకు స్థానికత ఆధారంగా స్పౌజ్, మెడికల్​కేటగిరీని అనుమతిస్తూ జిల్లా బదిలీలు చేపట్టాలి.
* కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు, డివిజన్లు, మండలాలలో పని చేస్తున్న అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహశీల్దార్లకు రెగ్యులర్‌గా వేతనాలు చెల్లించాలి.
* వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న డీఆర్వో పోస్టులను భర్తీ చేయాలి.

Advertisement

Next Story