షాకింగ్ న్యూస్.. తెలంగాణలో 50 వేల ఉద్యోగులకు నో పీఆర్సీ

by Anukaran |   ( Updated:2021-06-14 01:49:14.0  )
షాకింగ్ న్యూస్.. తెలంగాణలో 50 వేల ఉద్యోగులకు నో పీఆర్సీ
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో తొలి పీఆర్సీ విడుదల జీవోలు జారీ అయినప్పటికీ సుమారు 50 వేల మంది ఉద్యోగులు పీఆర్సీని అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఇదిగో, అదుగో అంటూ సంవత్సరాల తరబడి సాగదీసి ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించింది. చివరకు పీఆర్సీ జీవో పై రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం అనంతరం జీవో విడుదలైనప్పటికీ 2018 జూలై 1వ తేదీ తర్వాత నియమితులైన ఉద్యోగులు ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం ఫిట్మెంట్ పొందలేకపోతున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం ఉధృతంగా సాగిన ఫలితంగా 2014లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. సొంత రాష్ట్రం ఏర్పాటు అనంతరం పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు 2015లో విడుదల అయ్యాయి. వీటిల్లో గ్రూప్ – 2, ఎఫ్‌బీఓ, ఎఫ్‌ఎస్‌ఓ, వెటర్నరీ వైద్యులు, టీఆర్టీ టీచర్లు, గురుకుల టీజీటీ, పీజీటీ ఉద్యోగులు, పోలీస్ కానిస్టేబుళ్లు ఇలా సుమారు 50 వేల మంది ఉద్యోగాలు పొందారు. అయితే ప్రభుత్వం కాలయాపన చేసి ఉండకపోతే 2018 కంటే ముందే ఉద్యోగాలు పొందేవారు. ప్రభుత్వం చేసిన జాప్యం కారణంగా వీరంతా 2019 , 2020లల్లో ఉద్యోగాలు పొందారు . దీంతో ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం పీఆర్సీ ఫిట్మెంట్ వీరికి వర్తించకుండా పోయింది. జూలై 2018 తర్వాత నియామకం కాబడిన ఉద్యోగులందరూ బిస్వాల్ కమిటీ యందు 15 శాతం ప్రకారం రూపొందించిన మాస్టర్ స్కేల్స్ లోని మినిమమ్ బేసిక్ పే పొందే అవకాశం ఉండగా 30 శాతం ఫిట్మెంట్ పొందలేకపోవడం వారిని బాధిస్తోంది.

లక్షలలో నష్టం..

ఎస్‌జీ‌టీ ఉపాధ్యాయునికి రూ 21,230- 63,010 గా ఉన్నటువంటి స్కేల్‌కు 15 శాతం ప్రకారం బిస్వాల్ కమిటీ రూ 31,040- 92,050 కరస్పాండింగ్ స్కేల్ గా, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయునికి రూ 28,940- 78,910 కి రూ 42,300- 1,15,270 కరస్పాండింగ్ స్కేల్ గా నిర్ణయించడం జర్గింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం ఫిట్మెంట్ ప్రకారం 21,230 గా ఉన్న ఎస్‌జీ‌టీ ఉపాధ్యాయుని మినిమం బేసిక్ పే 34,690 అవుతుంది. అంటే 31,040 కి 34,690 కి తేడా 3,650. అలాగే 28,940 గా ఉన్న స్కూల్ అసిస్టెంట్ మినిమం బేసిక్ పే 47,240 గా ఉండాలి. అంటే 47,240 కి 42,300 కి తేడా 4,940 అంటే ఎస్ జీ టీ , స్కూల్ అసిస్టెంట్ లు నాలుగు ఇంక్రిమెంట్లు కోల్పోతున్నారు. ఇది వారి సర్వీస్ మొత్తానికి లెక్కిస్తే సుమారు రూ 30 నుండి 40 లక్షలు కోల్పోతున్నారు .

ప్రభుత్వ ఫలాలు అందరికీ అందించాలి..

ఇప్పటి వరకు ప్రకటించినట్లుగా పీఆర్సీ లలో కమిటీ ప్రతిపాధించిన మాస్టర్ స్కేల్స్ మార్చ లేదు. 2010 లో పీఆర్సీ అమలు తేదీ తర్వాత నియామకం అయినటువంటి ఉద్యోగులకు జరిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి 2 ఇంక్రిమెంట్లు కలిపి కరస్పాండింగ్ స్కేల్స్ ముందుకు జరిపి ఇవ్వడం జర్గింది. అప్పుడు ఎస్జీటీ ఉపాధ్యాయునికి 5470 – 12385 పే స్కేల్ కి 9460- 27700 కరస్పాండింగ్ స్కేల్ గా ఉంది. కానీ వారికి రెండు స్కేల్స్ ముందుకు జరిపి 10900-31550 గా ఇచ్చారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయునికి 7200- 16925 పే స్కేల్ కి 12550-35800 కరస్పాండింగ్ స్కేల్ ముందుకు జరిపి 14860-39540 గా ఇవ్వడం జర్గింది. ఇదే తీరును ఇప్పుడు కూడా కొనసాగించాలి. ప్రభుత్వం మానవతా దృక్పధంతో తెలంగాణ తొలి పీఆర్సీ ఫలాలను తొలి ఉద్యోగులకు అందించాలని కోరుతున్నాను. -కె లక్ష్మణ్, టీఆర్ టీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Next Story