ఆడియన్స్ లేకుండానే ఆడిస్తాం..

by Shyam |   ( Updated:2020-03-13 05:19:16.0  )
BCCI
X

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మిగిలిన రెండు వన్డేలకు ప్రేక్షకులను అనుమతించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. కరోనా వైరస్ ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ధర్మశాలలో నిర్వహించాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. కాగా లక్నో, కోల్‌కతాలో జరగాల్సిన మిగితా వన్డేలకు ప్రేక్షకులను అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.

కేంద్ర క్రీడా శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలతో బీసీసీఐ అధికారులు గురువారం చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాఫ్రికా జట్టు సభ్యులు కూడా మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో ఆ జట్టు సభ్యులు హోటల్ రూమ్స్ నుంచి బయటకు రావడం లేదు. కేవలం ప్రాక్టీస్ సెషన్స్‌కు మాత్రమే హాజరవుతున్నారు. వన్డే మ్యాచ్‌లు జరగనున్న ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలతోనూ బీసీసీఐ చర్చలు జరిపింది. సాధ్యమైనంత వరకు ప్రేక్షకులను మ్యాచ్‌లకు అనుమతించవద్దని ఆయా ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం మెగా టోర్నీలను రద్దు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఫార్ములా వన్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఒలింపిక్స్‌ను కూడా వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.

Tags: One Day Series, South Africa vs India, Coronavirus, No permission, BCCI, Sports Ministry, Triumph

Advertisement

Next Story

Most Viewed