నో లాక్‌డౌన్.. అంతా మాములే..

by Sampath |
నో లాక్‌డౌన్.. అంతా మాములే..
X
దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను వ‌రంగ‌ల్ ప్ర‌జ‌లు లైట్ తీసుకుంటున్నారు. వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ‌, కాజీపేట ప‌ట్ట‌ణాల్లో బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల త‌ర్వాత కూడా జ‌నం భారీ సంఖ్య‌లో రోడ్ల‌పై తిరుగుతున్నారు. కరోనా బాధితుల కుటుంబ స‌భ్యుల అవ‌స‌రాల రీత్యా బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా.. మ‌రికొంతమంది మాత్రం ఏవో చిన్న‌చిన్న కార‌ణాల‌తో వాహ‌నాల‌తో రోడ్డెక్కుతున్నారు..ఇలాంటి రోడ్ల‌పైకి వ‌చ్చే వారిలో అత్య‌ధికులు యూత్ ఉండ‌టం గ‌మ‌నార్హం. లాక్‌డౌన్ అమ‌లు తీరును ప‌రిశీలించేందుకు దిశ ప్ర‌తినిధి బుధ‌వారం వ‌రంగ‌ల్ ప‌ట్టణంలోని అన్ని ప్ర‌ధాన సెంట‌ర్ల‌లో ప‌ర్య‌టిస్తూ ప‌రిశీలించారు. ఈ ప‌రిశీల‌నలో లాక్‌డౌన్ నియ‌మాల‌ను జ‌నం పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లుగా క‌నిపించ‌ లేదు.
మ‌రోవైపు పోలీసులు ప్ర‌ధాన జంక్ష‌న్ల వ‌ద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహ‌నాల‌ను ఆపి ఫైన్లు వేస్తున్నారు. స‌హేతుక‌మైన కార‌ణాలు తెల‌పని వారి వాహ‌నాల‌ను అదుపులోకి తీసుకుని సంబంధిత స్టేష‌న్ల‌కు త‌ర‌లిస్తున్నారు. లాక్డౌన్ మొద‌లైన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోనే దాదాపు 4000 వాహ‌నాల‌ను అదుపులోకి తీసుకుని సీజ్ చేసిన‌ట్లుగా క‌మిష‌న‌ర్ త‌రున్‌జోషి మీడియాకు వివ‌రించారు. 5000 మందికి జ‌రిమానాలు విధించిన‌ట్లుగా వెల్ల‌డించారు.

అదుపు త‌ప్పిన లాక్‌డౌన్‌

ఉద‌యం ప‌ది గంట‌ల‌కు మూత ప‌డాల్సిన వ్యాపార సంస్థ‌లు కూడా తీరిగ్గా ప‌దిన్న‌ర త‌ర్వాత గాని మూయ‌డం లేదు. హోల్‌సేల్ కిరాణం షాపులు అయితే ష‌ట‌ర్ కింద‌కని. లోప‌ల‌కి జ‌నాన్ని తోలేస్తున్నారు. వీధి వ్యాపారులు ప్ర‌ధాన రోడ్ల‌కు ఆనుకున్న ప్ర‌దేశాల్లో అమ్మ‌కాలు జ‌రుపుతున్నారు. ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో కూడా ములుగురోడ్డు, ఎంజీఎం సెంట‌ర్‌, పోచ‌మ్మ‌మైదాన్‌, విజ‌య టాకీస్ రోడ్డు, బ‌స్టాండ్ రోడ్డు ప్రాంతాల్లో వేలాది మంది రోడ్ల‌పై తిరుగుతూ క‌నిపిస్తున్నారు. జ‌నాన్ని ఎలా అదుపు చేయాలో అర్థం కాక పోలీసులు సైతం త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌, చైత‌న్యం పెర‌గ‌డంతోనే లాక్డౌన్ అమ‌లు సాధ్య‌మ‌ని, త‌మ ప్ర‌య‌త్నం కొద్దిమేర‌కు మాత్ర‌మే ప‌నిచేస్తుంద‌ని వారు వాపోతున్నారు.

లాక్‌డౌన్ ఎలా ఉందో చూద్దామ‌ని వ‌స్తున్న యూత్‌

ప్ర‌ధాన రోడ్ల‌పైనే యువ‌త వాహ‌నాల‌తో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా.. కాల‌నీల్లో అయితే ష‌రామ‌మాలుగానే అన్న‌ట్లుగా ఉంది. ప్ర‌ధాన రోడ్ల‌పైకి వ‌స్తే జ‌రిమానాలు విధిస్తార‌న్న భ‌యం కాస్తో కూస్తో ఉండ‌గా.. సిబ్బంది కొర‌త‌తో కాల‌నీల్లో పోలీసుల‌ ప‌ర్య‌వేక్ష‌ణ లేకుండా పోయింది. దీంతో యువ‌త‌తో పాటు సామాన్య జ‌నం కూడా రోడ్ల‌పైకి వ‌చ్చేస్తున్నారు. పోలీసుల‌కు వాహ‌నాల‌తో చిక్కిన కొంత‌మంది యువ‌త ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని ప్ర‌శ్నిస్తుండ‌గా… లాక్‌డౌన్ ఎలా ఉందో చూద్దామ‌ని చెబుతుండ‌టం విశేషం.
Advertisement

Next Story

Most Viewed