తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ఇంకెప్పుడు?

by Shyam |
AYUSHMAN BHARAT scheme
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తొలినాళ్లలో వ్యతిరేకించినా, డిసెంబరు 31 న మాత్రం అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రకటన వెలువడి నెల రోజులు దాటినా ఇంకా మార్గదర్శకాలు, విధి విధానాలు, అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కానీ రాష్ట్రంలో ఏక కాలంలో అటు ‘ఆయుష్మాన్ భారత్’, ఇటు ‘ఆరోగ్యశ్రీ’ పథకాలు అమలవుతాయని ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు పాతిక లక్షల మంది లబ్ధి పొందుతారని అంచనా. కాగా, రాష్ట్ర నిర్ణయంతో సంబంధం లేకుండా కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు నేరుగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కేవలం రాష్ట్రంలోని దవాఖానలకు మాత్రమే వర్తిస్తుండగా ‘ఆయుష్మాన్ భారత్’ మొత్తం దేశానికీ వర్తిస్తుంది. దీనికి తోడు ‘పోర్టబిలిటీ’ సౌకర్యం కూడా ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్న ప్రాంతంలోనే గుర్తింపు పొందిన ఆస్పత్రిలో ‘ఆయుష్మాన్ భారత్’ ద్వారా చికిత్స పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ప్రైవేటు ఆస్పత్రులు రాష్ట్ర ప్రజలకు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందినవారికి చికిత్స అందించే వీలుంది.

రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్యశ్రీ’ పథకం కోసం ఏటా బడ్జెట్‌లో సుమారు రూ. 1300 కోట్లను కేటాయిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల తెలిపారు. వాస్తవంగా సగటున రూ.700 కోట్లకు పైగా ఈ పథకం కోసం ఖర్చవుతోంది. కొన్ని నెలలుగా ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు విడుదల కావడంలేదు. దీంతో ఆ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ధర్నాలు చేశాయి. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. ఇప్పుడు ‘ఆయుష్మాన్ భారత్’ వినియోగంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది. కేంద్రం నుంచి వచ్చే నిధులతో కాస్త ఉపశమనం లభిస్తుంది.

అల్పాదాయ వర్గాలకు లబ్ధి :

కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కిందికి వచ్చే అల్పాదాయ వర్గాలకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు వేర్వేరు నిబంధనలు సూచించారు. సొంత భూమి లేకుండా కేవలం కూలీ మీదనే ఆధారపడేవారు, పక్కా ఇల్లు లేకుండా గుడిసెల్లో, షెడ్లలో నివసిస్తున్నవారు, ఎస్సీ-ఎస్టీ కుటుంబాలు.. ఇలా కొన్ని నిబంధనలను రూపొందించింది. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే ఇళ్లల్లో పనిచేసేవారు, చెత్త ఏరుకునేవారు, భిక్షగాళ్లు, పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లు, రిక్షా కార్మికులు, టైలర్లు, చేతివృత్తులవారు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, హమాలీ కార్మికులు, సెక్యూరిటీ గార్డు, చౌకీదార్‌లు, దోబీలు, మెకానిక్‌లు, ఇలా అనేక సెక్షన్ల ప్రజలు ఈ పథకం కింద లబ్ధిదారులని పేర్కొంది.

రాష్ట్రంలో సుమారు పాతిక లక్షల మంది

‘ఆయుష్మాన్ భారత్’ ద్వారా రాష్ట్రంలో సుమారు పాతిక లక్షల మంది అల్పాదాయ వర్గాల కుటుంబాలు వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ‘ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా మాత్రం సుమారు 88 లక్షల కుటుంబాలు లబ్ధి పొందే వీలుంది. సుమారు వెయ్యి రకాల జబ్బులకు ఈ పథకం ద్వారా గరిష్ట స్థాయిలో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వైద్య సేవలను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ‘ఆయుష్మాన్ భారత్’ అమలుకు మార్గదర్శకాలు, విధివిధానాలను రూపొందించకపోయినా ఏక కాలంలో రెండు పథకాలను అమలు చేయాలనుకుంటోంది. ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వచ్చేవారికి ఆ పథకం కిందనే, ఈ పరిధిలోకి రాని లబ్ధిదారులకు ‘ఆరోగ్యశ్రీ’ ద్వారానే వైద్య సేవలను దానికిందనే సేవలను అందించనున్నట్లు వైద్యారోగ్య శాఖ వర్గాల సమాచారం.

తెల్ల రేషను కార్డులు ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ అమలవుతోంది. చాలా మంది సంపన్న వర్గాలు ఈ రేషన్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పథకం పేరుతో వైద్య సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం ఉన్న లబ్ధిదారుల్లో సుమారు మూడో వంతు మంది ‘ఆయుష్మాన్ భారత్’ పరిధిలోకి రానున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రాథమిక స్థాయిలో ఆయుష్మాన్ భారత్ అమలుకు కసరత్తు చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి నుంచి వచ్చే తుది నిర్ణయానికి అనుగుణంగా స్పష్టమైన గైడ్‌లైన్స్ తయారుకానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed