హమ్మయ్య… ఇక అది గుమ్మం దాటినట్టే!

by vinod kumar |   ( Updated:2020-04-29 02:19:22.0  )
హమ్మయ్య… ఇక అది గుమ్మం దాటినట్టే!
X

దిశ‌, ఖ‌మ్మం: క‌రోనా కోర‌ల నుంచి ఖ‌మ్మం బ‌య‌ట‌ప‌డుతుండడంతో గండం గ‌డిచినట్లేన‌ని జిల్లా యంత్రాంగం భావిస్తోన్నది. గ‌త ఏడు రోజులుగా జిల్లాలో కొత్త క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదుకాక‌పోవ‌డంతో అధికారులు, ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఖ‌మ్మం జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదు కాగా న‌లుగురు క‌రోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న‌ట్లు డీఎంహెచ్‌వో మాల‌తి తెలిపారు. ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆ న‌లుగురు హోంక్వారంటైన్‌లో కొన‌సాగుతున్న‌ట్లు తెలిపారు. జిల్లాలో ఇంకా కేవ‌లం నాలుగు కేసులే యాక్టివ్‌గా ఉండ‌టంతో యంత్రాంగంలో కాస్త ఆందోళ‌న త‌గ్గింది. మిగిలిన ఆ న‌లుగురికి కూడా ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ రావ‌డం..త్వ‌ర‌లోనే ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి హోం క్వారంటైన్‌కు చేరుకోనున్నారు.

అక్కడ మాత్రం..

కొత్త‌గా క‌రోనా ల‌క్ష‌ణాల అనుమానాల‌తో ఆస్ప‌త్రికి వ‌చ్చే వారి సంఖ్య దాదాపు త‌గ్గిపోయింది. ఇప్ప‌టికే కొన‌సాగుతున్న ఆరోగ్య స‌ర్వేల్లోనూ క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేద‌ని వైద్యాధికారుల‌కు అందుతున్న రిపోర్టుల్లో వ్య‌క్త‌మ‌వుతోన్నది. అయితే వ‌చ్చే వారం రోజుల్లో జిల్లాలో ఒక్క‌ క‌రోనా పాజిటివ్ కేసు కూడా న‌మోదుకాకపోతే జిల్లా నుంచి మ‌హ‌మ్మారి పారిపోయిన‌ట్లుగా చెప్ప‌వ‌చ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లాలో మొద‌టి కేసు వెలువ‌డిన ఖ‌మ్మం రూర‌ల్ మండ‌లం పెద్ద‌తండాను కంటైన్మెంట్ నుంచి ఎత్తేశారు. అలాగే మోతీన‌గ‌ర్‌లోనూ ఎత్తేశారు. అయితే ఒకే కుటుంబం నుంచి ఆరు క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన ఖిల్లా బజార్‌ లో మాత్రం ఇంకా కంటైన్మెంట్ కొన‌సాగుతోన్నది.

వీలు కల్పిస్తున్నారు..

ఇక జిల్లా ఆస్ప‌త్రిలో అనుమానిత ల‌క్ష‌ణాల‌తో క్వారంటైన్‌లో కొన‌సాగుతున్నవారి సంఖ్య‌ 699 వ‌ర‌కు ఉంది. వీరిలో చాలామంది గ‌డువు మూడు నుంచి నాలుగు రోజుల్లో ముగియ‌నున్నది. అధికారులు లాక్‌డౌన్ అమ‌లు, సామాజిక దూరం పాటించేలా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకురావ‌డం వంటి వాటితో జిల్లాలో వైర‌స్ వ్యాప్తినిని పూర్తిగా త‌గ్గించాయ‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌రోవైపు భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో కూడా ఎలాంటి కొత్త కేసులు న‌మోదుకాక‌పోవ‌డంతో ప్ర‌జాప్ర‌తినిధులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే జిల్లాలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టినా పొరుగున ఉన్న సూర్యాపేట జిల్లాలో కేసులు ఇంకా న‌మోదవుతుండ‌టంతో జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉంది. ఆ జిల్లా నుంచి రాక‌పోక‌ల‌ను పూర్తిగా నిలిపివేశారు. అత్య‌వ‌స‌ర‌మున్న వారిని మాత్రం పేర్లు, ఇత‌ర వివ‌రాలు న‌మోదు చేసుకుని జిల్లా గుండా ప్ర‌యాణించేందుకు వీలు క‌ల్పిస్తున్నారు.

Tags: khammam, no positive cases, corona, officers

Advertisement

Next Story

Most Viewed